విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించిన మై హోమ్ గ్రూప్, ప్రారంభించిన కపిల్ దేవ్

సమాజానికి నాణ్యమైన విద్య, మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మెన్ జూపల్లి జగపతి రావ్ అన్నారు. అందుకే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.

విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించిన మై హోమ్ గ్రూప్, ప్రారంభించిన కపిల్ దేవ్

My Home Group School

Updated On : January 10, 2024 / 12:38 AM IST

My Home Group : విద్యార్థులకు నాణ్యమైన విద్య, అన్ని వ‌స‌తుల‌తో కూడిన పాఠ‌శాల‌ను నిర్మించింది మై హోమ్ గ్రూప్‌. హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ మండలం ముచ్చింతల్ గ్రామంలో నిర్మించిన ఈ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ ప్రారంభించారు. మై హోమ్‌ గ్రూప్‌, ఖుషి స్వచ్ఛంద సంస్థ ఈ స్కూల్ బిల్డింగ్‌ని సంయుక్తంగా నిర్మించాయి.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా మై హోమ్ గ్రూప్‌ ముందుకొచ్చింది. హైదరాబాద్ శివారు శంషాబాద్‌ మండలం ముచ్చింతల్ గ్రామంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనాన్ని క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ ప్రారంభించారు. నేటి చిన్నారులే రేపటి మన దేశ భవిష్యత్ అని కపిల్‌దేవ్ అన్నారు‌. విద్యార్థులకు మంచి విద్య అందించేందుకు ముందుకు వచ్చిన మై హోమ్ గ్రూప్‌కి ఆయన అభినందనలు తెలిపారు.

తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు.. కాస్త బాధగా ఉందన్నారు కపిల్‌దేవ్‌. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. స్కూల్ విద్యార్థుల సాంస్కృతి కార్యక్రమాలు తనకెంతో నచ్చాయని కపిల్ దేవ్ సంతోషం వ్యక్తం చేశారు. మళ్లీ టైమ్‌ చూసుకొని తప్పకుండా ముచ్చింతల్ పాఠశాలకు వస్తానని అన్నారు.

సమాజానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాల్సిన అవసరం ఉంది- జూపల్లి జగపతి రావ్
సమాజానికి నాణ్యమైన విద్య, మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మెన్ జూపల్లి జగపతి రావ్ అన్నారు. అందుకే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రతీ ప్రైవేట్ సంస్థ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకోసం సీఎం రేవంత్ రెడ్డి మంచి పథకాల్ని తీసుకొస్తున్నారని.. విద్య, వైద్యానికి కూడా సీఎం పెద్ద పీట వేయాలని జగపతిరావు కోరారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు ఖుషి ఫౌండేషన్‌ బోర్డు మెంబర్‌ పార్వతి రెడ్డి. తమ ఫౌండేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మంది విద్యార్థులకి సాయం అందిస్తున్నామని ఆమె చెప్పారు. ఇప్పటికే ఖుషి ఫౌండేషన్‌ తెలంగాణ రాష్ట్రంలో 9 స్కూళ్లను నడిపిస్తోందని తెలిపారు.

విద్యార్థుల చదువు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు ఖుషి ఫౌండర్ పార్వతి. రానున్న రోజుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తమ ధ్యేయమన్నారు. తమ గ్రామంలో పేద విద్యార్థులకు ప్రభుత్వం పాఠశాల నూతన భవనాన్ని నిర్మించి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని.. గ్రామ సర్పంచ్ సుజాత తెలిపారు. గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించిన మైహోమ్‌ గ్రూప్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

పేద విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో.. మై హోమ్ గ్రూప్ సంస్థ, నూతన స్కూల్ భవనాన్ని నిర్మించి విద్యార్థులకు బహుమతిగా ఇచ్చింది. ఖుషి ఫౌండేషన్‌తో చేతులు కలిపి ఆధునిక హంగులతో నిర్మించిన ఈ స్కూల్‌ ప్రారంభోత్సం ఘనంగా జరిగింది. నూతన భవనాన్ని నిర్మించిన.. మై హోమ్ గ్రూప్‌, ఖుషి ఫౌండేషన్‌కు.. విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.