SLBC Tunnel Indicent: టన్నెల్‌లోనే కార్మికులు.. సహాయక చర్యలకు ఆటంకం.. వెనక్కు వచ్చేసిన రెస్క్యూ బృందాలు.. నెక్ట్స్ ఏమిటి?
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

SLBC Tunnel Indicent
SLBC Tunnel Indicent: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగ మార్గంలో 14వ కిలోమీటరు వద్ద పైకప్పు కూలి పెనుప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం సమయంలో దాదాపు 50మంది కార్మికులు అందులో పనులు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు, సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కార్మికులు సురక్షితంగా బయటకు రాగా.. ఎనిమిది మంది అందులో చిక్కుకున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Also Read: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే: కేటీఆర్
టన్నెల్లో చిక్కుకుంది వీరే..
టెన్నెల్ లో చిక్కుకున్న వారిలో జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్ (పీఈ), శ్రీనివాస్ (ఎస్ఈ), రోజువారీ కార్మికులు సందీప్ సాహు, జక్తాజెస్, సంతోష్ సాహు, అనూజ్ సాహు ఉన్నారు. వీరితోపాటు రాబిన్ సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్, గురుదీప్ సింగ్ టన్నెల్ లో చిక్కుకుపోయారు. అయితే, వీరిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే, టన్నెల్ లో 12 కిలో మీటర్లు దూరం వ్యాగన్లలో వెళ్లడానికి అవకాశం ఉందని, తరువాత వెళ్లడం కష్టమని రెస్యూ బృందాలు చెబుతున్నాయి.
సహాయక చర్యలకు ఆటంకం..
టెన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది సిబ్బంది 22గంటలుగా అందులోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. అయితే, రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం ఏర్పడుతుంది. బురద, నీటితో టన్నెల్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ బృందం చేరుకోలేక పోతుంది. 12కిలోమీటర్లు అండర్ టన్నెల్ ట్రైన్ లో ప్రయాణించి అక్కడినుండి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ బృందం లోపలికి వెళ్లింది. మోకాలు లోతు వరకు నీరు నిండి ఉండటంతో ముందుకు వెళ్లలేక పోయారు. మొత్తం ఆరు మీటర్ల మేర బురదతో నిండుకు పోయిదంటూ అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో టన్నెల్లోకి వెళ్లిన రెస్క్యూ బృందాలు నాలుగు గంటల తరువాత ముందుకు వెళ్లలేక బయటకు వచ్చాయి.
టన్నెల్ లోపలి దృశ్యాలను రెస్క్యూ టీమ్స్ ఫోన్ లో రికార్డ్ చేశాయి. రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలికి చేరుకునే పరిస్థితిలేక వెనక్కు రావడంతో తరువాత ఏం చేయాలన్న దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఘటనా స్థలానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.