తెలంగాణలో సరికొత్త రాజకీయాలు.. ఎమ్మెల్సీ పదవుల కోసం గవర్నర్‌కు వినతులు

పెద్దల సభలో అడుగు పెట్టాలని భావిస్తున్న కొంతమంది నేతలు… గవర్నర్ కోటాలో భర్తీ కావలసిన శాసనమండలి స్థానాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీ అధినేత ద్వారా ప్రయత్నాలు చేయాల్సిన వారు కాస్త.. రూటు మార్చి నేరుగా గవర్నర్‌కే తమ మనసులోని కోరికను తెలియజేయడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశం అయ్యింది. సాధారణంగా గవర్నర్ కోటాలో పదవుల భర్తీ విషయంలో కొన్ని నిబంధనలున్నా…. ముఖ్యమంత్రి విచక్షణాధికారాలకు లోబడి అవకాశం దక్కుతుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.
సీఎం నిర్ణయం మేరకే గవర్నర్ కోటాలో మండలి సభ్యుల ఎంపిక:
వివిధ రంగాల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారితో పాటు ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు గవర్నర్ కోటాలో మండలి సభ్యుల ఎంపిక జరుగుతుంది. ఈ కోటాలో పదవులు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్న పలువురు అధికార పార్టీ నేతలు కూడా గవర్నర్ కోటాలో తమకు అవకాశం కల్పించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారని చెబుతున్నారు. గవర్నర్ కార్యాలయానికి అందే అన్ని అర్జీలను సహజంగా ప్రభుత్వానికి పంపించి, సమస్యల పరిష్కారం కోసం గవర్నర్ సిఫారసు చేస్తారు.
శాసనమండలిలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న పలువురు ఇదే అవకాశంగా గవర్నర్‌కు దరఖాస్తు చేసుకున్నారట. ఈ అంశాన్ని పరిశీలించాలని గవర్నర్ కార్యాలయం ప్రభుత్వానికి ఆ ఆర్జీలను పంపింది. ఈ జాబితాలో పలువురు అధికార పార్టీ నేతలు కూడా ఉండడం గులాబీ పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
పదవుల భర్తీ విషయంలో సీఎందే ఫైనల్ డెసిషన్:
గవర్నర్ కోటాలో మండలి సభ్యుల ఎంపిక నిర్ణయాధికారం ముఖ్యమంత్రికే ఉంది. ఆయనదే తుది నిర్ణయం అవుతుంది. శాసనమండలి సభ్యులతో పాటు రాష్ట్ర పరిధిలో ఉన్న పలు రాజ్యంగబద్ధమైన పదవుల భర్తీ విషయంలో కూడా సీఎందే ఫైనల్ డెసిషన్. ముఖ్యమంత్రి నిర్ణయించిన అభ్యర్థుల జాబితాకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. సీఎం పంపే పేర్లపై అభ్యంతరాలుంటే మాత్రం గవర్నర్ ఒకసారి దానిపై క్లారిటీ తీసుకోవచ్చు.
గవర్నర్ ఏం చేయనున్నారు?
సహజంగా సీఎం నిర్ణయం మేరకు వచ్చిన జాబితాకు గవర్నర్ ఆమోదం తెలపడం ఆనవాయితీగా వస్తోంది. కొన్నిసార్లు గవర్నర్ వ్యక్తం చేసే అభిప్రాయాలు వివాదాస్పదంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో సమాచార హక్కు కమిషనర్ల నియామకం విషయంలో అప్పటి గవర్నర్… ముఖ్యమంత్రి ప్రతిపాదించిన వ్యక్తులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుల ఎంపిక విషయంలో గవర్నర్లు ఇప్పటి వరకు సీఎం నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. మరి గవర్నర్ తనకు అందిన అర్జీలను పరిశీలిస్తారో.. సీఎం పంపించే జాబితానే ఫైనల్ చేస్తారో చూడాలని అంటున్నారు.