BRS Tension : ఎన్నికల వేళ గులాబీ పార్టీలో గుబులు, ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని టెన్షన్

అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి పార్టీలో పరిస్థితులను చక్కదిద్దుకోవాలని చూసిన గులాబీ బాస్ కేసీఆర్ అంచనాలు తప్పుతున్నాయా? BRS Tension

BRS Tension : ఎన్నికల వేళ గులాబీ పార్టీలో గుబులు, ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని టెన్షన్

BRS Tension - Elections

BRS Tension – Elections : అధికార బీఆర్ఎస్ కు అసమ్మతి నేతల వ్యవహారం తలనొప్పిగా మారుతోంది. పార్టీ పెద్దల బుజ్జగింపులతో హైదరాబాద్ లో మెత్తబడ్డట్లే కనిపిస్తున్న నేతలు నియోజకవర్గంలో అడుగుపెట్టగానే ప్లేట్ ఫిరాయిస్తున్నారు. పోటీ చేసే తీరుతాము అంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. అధికార పార్టీలో ఎన్నడూ లేని విధంగా ధిక్కార స్వరాలు పెరిగిపోవడానికి కారణం ఏంటి?

అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి పార్టీలో పరిస్థితులను చక్కదిద్దుకోవాలని చూసిన గులాబీ బాస్ కేసీఆర్ అంచనాలు తప్పుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 119 నియోజకవర్గాలకుగాను ఏకంగా 115 నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు సీఎం కేసీఆర్. కేవలం ఏడుగురు సిట్టింగ్ అభ్యర్థులను మార్చి కొత్త నేతలకు అవకాశం ఇచ్చారు.

Also Read: నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లను తిరస్కరించిన తమిళిసై

అయితే, క్షేత్రస్థాయిలో టికెట్లు ఆశించిన నేతలు చాలా ఎక్కువ మంది ఉండటంతో టికెట్ల ప్రకటన తర్వాత అసమ్మతి స్వరాలు మొదలయ్యాయి. నియోజకవర్గ పరిస్థితులతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కేది కష్టం అన్న అంచనాతో దాదాపు ఏడాది నుంచి చాలామంది నేతలు ఆశలు పెంచుకున్నారు. తమకంటూ ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారు. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలకే పార్టీ ఎక్కువగా అవకాశాలు ఇవ్వడంతో టికెట్లు ఆశించిన నేతలు అభ్యర్థులకు వ్యతిరేకంగా నిరసన గళం విప్పుతున్నారు. మరోవైపు టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు వ్యతిరేక స్వరాలు వినిపిస్తుండటంతో పరిస్థితి మరింత సీరియస్ గా మారింది.

సిట్టింగ్ శాసనసభ్యుల స్థానాల్లో కొత్త నేతలకు అవకాశం ఇచ్చిన నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి రోజురోజుకి రాజుకుంటోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ పెద్దలు ఇటీవలే బుజ్జగింపుల పర్వాన్ని మొదలు పెట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు టికెట్ దక్కని నేతలను ఒకేసారి పిలిపించి అటు హరీశ్ రావు, ఇటు కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. పార్టీ పెద్దల ముందు అభ్యర్థికి సహకరించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతున్న పలువురు నేతలు నియోజకవర్గానికి వెళ్లగానే మాట మార్చేస్తున్నారు.

Also Read: ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కి షాక్.. పార్టీకి ఎమ్మెల్యే రాజీనామా.. ఎందుకంటే?

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య మధ్య మంత్రి కేటీఆర్ సమక్షంలో ఇలాంటి రాజీ చర్చలే జరిగాయి. ఆ సమయంలో కేటీఆర్ ముందు కడియం శ్రీహరికి సహకరిస్తానని హామీ ఇచ్చిన రాజయ్య నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీఫామ్ వస్తుందంటూ ప్రచారం చేయడం గందరగోళాన్ని సృష్టిస్తోంది. కడియంకు రాజయ్య సహకరిస్తారని బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటన విడుదల చేసిన తర్వాత కూడా రాజయ్య అడ్డం తిరగడం హాట్ టాపిక్ గా మారింది.

ఇలా రాజయ్య ఒక్కరే కాకుండా బీఆర్ఎస్ లో పలువురు నేతలను ఉదహరిస్తున్నారు పరిశీలకులు. జనగామలో ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డికి దాదాపు లైన్ క్లియర్ కాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తాను అని కార్యకర్తలతో అంటున్నారు. ముత్తిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం ఎమ్మెల్యే పదవి కోసమే పట్టుబడుతున్నారు.

ఇక కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరిస్థితి మరోలా ఉంది. ఆయనకు టికెట్ కన్ ఫామ్ చేసినా అసమ్మతి నేతలు మాత్రం మద్దతివ్వలేము అంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. వేములవాడలో చెన్నమనేని రమేశ్ కు కేబినెట్ హోదాతో సమానమైన పదవి ఇచ్చినా పార్టీ అభ్యర్థి చెలమడ లక్ష్మీనరసింహారావుతో రమేశ్ కు సయోధ్య కుదరడం లేదు. ఇప్పటివరకు ఈ ఇద్దరు కనీసం కలుసుకోలేదు.

Also Read: బీఆర్ఎస్‌లో చేరిన 2 నెలలకే.. మళ్లీ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న కీలక నేత

ఇక ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నా ఎన్నికల ముందు సమయానుకూలంగా నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా బోధ్ ఎమ్మెల్యే బాపూరావ్ పార్టీ అభ్యర్థికి సహకరిస్తాను అంటూ మొదట్లో ప్రకటించారు. అయితే, పార్టీ పెద్దలు ఎవరూ తనను కనీసం పట్టించుకోలేదంటూ తాజాగా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. అటు పఠాన్ చెరులోనూ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన బలమైన నేత నీలం మధుతో కేసీఆర్, హరీశ్ రావులు చర్చలు జరిపారు. అయినా ఆయన పక్క చూపులు చూస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది.

ఇలా అసమ్మతి నేతలు గులాబీ పార్టీకి చికాకు పుట్టిస్తుండటంతో ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని టెన్షన్ పడుతున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు.