ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు..
డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Telangana IAS Officers Petition (Photo Credit : Google)
IAS Officers : ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులో కూడా ఊరట లభించలేదు. ఐఏఎస్ లు వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. క్యాట్ ఆదేశాలను న్యాయస్థానం సమర్థించింది. డీవోపీటీ ఉత్తర్వుల ప్రకారం ఐఏఎస్ అధికారులు వెంటనే ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
డీవోపీటీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఉత్తర్వులు పాటించాల్సిందేనని, ఆంధ్రప్రదేశ్ లో రిపోర్టు చేయాల్సిందేనని క్యాట్ (కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్) ఇచ్చిన తీర్పుపై ఐఏఎస్ లు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, ఈ పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది.
ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ లు అంజనీ కుమార్(మాజీ డీజీపీ), అభిలాష్ మిశ్రా, మహంతి.. వెళ్లి ఆంధ్రప్రదేశ్ లో రిపోర్ట్ చేయాలంటూ డీవోపీటీ ఇచ్చిన సర్కులర్ ను హైకోర్టు కూడా సమర్పించింది.
ప్రస్తుతం తెలంగాణలో పని చేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రాస్ లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సి ఉంది. ఏపీలో పని చేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం తాము పని చేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు.
కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వాదనల అనంతరం డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, అక్కడ కూడా వారికి రిలీఫ్ దక్కలేదు.
Also Read : ఏనుగు మీద విసిరిన బాణం రివర్స్ కొట్టిందా? పరేషాన్‌లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి..!