Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు.. ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు..

ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి బిగ్‌షాక్ తగిలింది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ తెలంగాణ హైకోర్టులో ..

Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసు.. ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు..

IAS officer Srilakshmi

Updated On : July 25, 2025 / 11:53 AM IST

IAS Officer Srilakshmi: ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి బిగ్‌షాక్ తగిలింది. ఈ కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ తెలంగాణ హైకోర్టులో ఆమె రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం న్యాయస్థానం ఆమె పిటిషన్ పై విచారణ జరిపింది. అనంతరం ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో శ్రీలక్ష్మిని ఈ కేసులో హైకోర్టు దోషిగా తేల్చింది.

ఓబులాపురం (ఓఎంసీ) కేసులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఓఎంసీ కేసులో ఆమె నిందితురాలేనని కోర్టు తీర్పు ఇచ్చింది. సీబీఐ, ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. ఆమె డిశ్చార్జ్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. శ్రీలక్ష్మి ఈ కేసులో నిందితురాలేనని ట్రయల్ ఎదుర్కోవాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో శ్రీలక్ష్మి వ్యవహారంలో సీబీఐ కోర్టులో ట్రయల్ కొనసాగనుంది.

ఓఎంసీ మైనింగ్ లీజు వ్యవహారం 2006లో శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదలైంది. లీజు వ్యవహారంలో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. లీజు కేటాయింపులో నిబంధనలను ఉల్లంఘించి, అక్రమ రీతిలో అనుమతులు మంజూరు చేశారని సీబీఐ వాదనలు వినిపించింది. సీబీఐ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించింది.

2022లో తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మికి ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే, ప్రతివాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును మళ్లీ విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ వాదన వినకుండా ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని, ఇరుపక్షాల వాదనలను పరిగణలోకి తీసుకుని తాజాగా విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టు పిటిషన్ ను హైకోర్టుకు పంపుతూ మూడు నెలల్లో తేల్చాలని ఆదేశించింది.

ఓఎంసీ లీజు కేటాయించేలా శ్రీలక్ష్మి చొరవ తీసుకున్నారని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. పలు దరఖాస్తులు వచ్చినా ఓఎంసీకి లీజు వచ్చేలా శ్రీలక్ష్మీ చూశారని, అందుకు సంబంధించిన ఆధారాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. సీబీఐ పేర్కొన్న విధంగా.. శ్రీలక్ష్మి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, మైనింగ్ లీజుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారని గుర్తించింది. దీంతో శ్రీలక్ష్మిని ఈ కేసులో దోషిగా తేల్చిన హైకోర్టు.. ఆమె డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేసింది.