Old Age Pensions : 57ఏళ్లకే వృద్దాప్య పెన్షన్, త్వరలోనే అమలు
వృద్ధాప్య పెన్షన్ అర్హతను 57ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో మరో 6లక్షల 62వేల మందికి పెన్షన్లు అందనున్నాయి.

Old Age Pensions
Old Age Pensions : వృద్ధాప్య పెన్షన్ అర్హతను 57ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో మరో 6లక్షల 62వేల మందికి పెన్షన్లు అందనున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 58 లక్షలకు పెరగనుంది.
కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ పద్దతిని కొనసాగిస్తూ.. భర్త చనిపోతే భార్యకు భార్య చనిపోతే భర్తకు వెంటనే పెన్షన్ బదిలీ చేయాలని, ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే దోభీ ఘాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వారంలోగా దీన్ని సంపూర్ణంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీలో దళితబంధుపై ప్రధానంగా చర్చించారు. పోడు భూముల అంశం, దళిత వాడల అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, ఏపీతో నీటి వివాదం అంశం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నూతన మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపైనా కేబినెట్ చర్చించింది. వీటితోపాటు గత కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించింది.