ఎంత ఘోరం.. కల్లులో పురుగుల మందు కలిపిన వ్యక్తి.. ఎందుకంటే?

ఆ లొట్టిని తీసుకెళ్లి స్థానిక పోలీసులకు వీరబాబు ఫిర్యాదు చేశాడు.

ఎంత ఘోరం.. కల్లులో పురుగుల మందు కలిపిన వ్యక్తి.. ఎందుకంటే?

Updated On : February 12, 2025 / 10:11 AM IST

సమాజంలోని చాలా మంది తమ తోటి ఉద్యోగులు, కార్మికులపై ఈర్ష్య, అసూయ, ద్వేషాన్ని పెంచుకుంటారు. తమ కంటే బాగా పనిచేస్తున్న ఉద్యోగి, కార్మికుడిపై సాధారణంగానే చాలా మందిలో అసూయ ఉంటుంది.

తమ పనితీరును మెరుగుపర్చుకోరుగానీ, బాగా పనిచేసేవాళ్లపై మాత్రం అసూయను పెంచుకుంటారు. కేవలం అసూయ పెంచుకుంటే కొంతమే నష్టం జరుగుతుంది. అదే కక్షగా మారితే? ఇటువంటి ఘటనే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో చోటుచేసుకుంది.

తోటి గీత కార్మికుడి కల్లు కుండలో పురుగుల మందు కలిపాడు మరో గీత కార్మికుడు. తన కన్నా ఎక్కువ కల్లు గీస్తున్నాడన్న అసూయే అందుకు కారణం. జీళ్లచెరువు దగ్గర తాళ్లల్లో గీత కార్మికులు ఎన్నో ఏళ్లుగా కల్లు గీస్తున్నారు.

Also Read: బర్డ్ ఫ్లూ టైమ్‌లో కూడా చికెన్‌ తినాలంటే ఇలా చేయండి..

తోటి గీతకార్మికుల్లాగే రమేశ్ గౌడ్, వీరబాబు ఇక్కడ కల్లు గీస్తూ బతుకుతున్నారు. అయితే, వీరబాబు గీసే చెట్ల నుంచి ఎక్కువగా కల్లు వస్తోందని రమేశ్ అసూయ పెంచుకున్నాడు. రమేశ్ దగ్గర ప్రతిరోజు కల్లుతాగేందుకు వెళ్లే ఇద్దరు వ్యక్తులు.. తాజాగా ఆయన కల్లును కాదని వీరబాబు దగ్గరకు కల్లు తాగేందుకు వెళ్లారు.

దీంతో వీరబాబుపై రమేశ్‌కు మరింత కోపం పెరిగింది. వీరబాబుతో రమేశ్ గొడవపడ్డాడు. వీరబాబు వద్ద ఎవ్వరూ కల్లు తాగకుండా చేయాలన్న ఉద్దేశంతో పిబ్రవరి 6న ఎవ్వరూ చూడకుండా వీరబాబు గీసే తాటి చెట్టును ఎక్కాడు.

చెట్టుపై ఉన్న కల్లు లొట్టిలో పురుగుల మందు కలిపాడు. ఆ తదుపరి రోజు వీరబాబు ఎప్పలిలాగే తన చెట్టు ఎక్కి లొట్టిలోని కల్లుని తీసి కిందకు తీసుకొచ్చాడు. ఆ కల్లు వాసన రావడంతో దాన్ని బాగా పరిశీలించాడు.

అందులో ఎవరో పురుగుల మందు కలిపినట్లు గుర్తించాడు. ఆ లొట్టిని తీసుకెళ్లి స్థానిక పోలీసులకు వీరబాబు ఫిర్యాదు చేశాడు. రమేశ్ మీద తనకు అనుమానం ఉందని పోలీసులకు చెప్పాడు. ఆ మందును తానే కలిపానని పోలీసులకు ముందు రమేశ్ అంగీకరించాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.