పాస్‌పోర్ట్‌ కుంభకోణం : బోధన్‌ అడ్రస్‌లకు ఇంకా వస్తోన్న పాస్‌పోర్టులు

పాస్‌పోర్ట్‌ కుంభకోణం : బోధన్‌ అడ్రస్‌లకు ఇంకా వస్తోన్న పాస్‌పోర్టులు

Updated On : February 27, 2021 / 1:49 PM IST

Bodhan Passport scandal : నిజామాబాద్ జిల్లా బోధన్‌లో పాస్‌పోర్టుల కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బంగ్లాదేశీయులు బోధన్ అడ్రస్‌తో పాస్‌ పోర్టులు పొందడం…కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉలిక్కి పడేలా చేసింది. దీనిపై దర్యాప్తు సాగుతున్నా అక్రమ పాస్‌పోర్టులు ఆగడం లేదు. బోధన్ అడ్రస్‌లకు పోస్ట్ ద్వారా ఇంకా కొత్త పాస్‌పోర్టులు వస్తూనే న్నాయి. రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం నుంచి బోధన్‌ పోస్టాఫీస్‌కు రెండు రోజుల వ్యవధిలో 70కి పైగా పాస్‌పోర్ట్‌ కవర్లు వచ్చాయి. డోర్‌ లాక్‌ కారణంగా చూపుతూ ఆ కవర్లను వెనక్కి పంపినట్టు అధికారులు చెప్పారు. పాస్‌ పోర్ట్ జారీ అయిన చిరునామాలో ఎవరూ లేకపోవడం, స్థానికులు ఆ పేరుతో ఉన్నవారెవరూ తమకు తెలియరని చెప్పడంతో పోస్టల్ సిబ్బంది వెనక్కి వెళ్లిపోయారు.

పాస్‌పోర్టు కార్యాలయం నుంచి వచ్చినవి లేఖలు అని సిబ్బంది చెబుతున్నప్పటికీ..అవి పాస్‌పోర్టులే అని స్థానికులు చెప్పుకుంటున్నారు. అటు తప్పుడు పాస్‌పోర్టులు పొందిన బంగ్లాదేశీయులను పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అన్ని ఎయిర్ పోర్టులకు లుకౌట్ నోటీసులు పంపారు. మరోవైపు పాస్‌పోర్టుల కుంభకోణంలో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అనీల్, మల్లేశ్‌ పాత్రపై విస్తృత దర్యాప్తు చేస్తున్నారు ఉన్నతాధికారులు. 2016 నుంచి స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహించిన ఆ ఇద్దరు పోలీసులు 500 పాస్‌పోర్టులు జారీ చేసినట్టు గుర్తించారు. పాస్‌పోర్టులు పొందిన వారి ఇళ్లకు ప్రత్యేక బృందాలను పంపుతున్నారు అధికారులు.

గత నెల 24న ముగ్గురు బంగ్లాదేశీయులు భారత పాస్‌పోర్టులపై దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఇమ్మిగ్రేషన్ అధికారులకు పట్టుబడ్డారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేయగా పాస్‌పోర్టుల కుంభకోణం వెలుగు చూసింది. బోధన్ కేంద్రంగా తప్పుడు పత్రాలు సృష్టించి బంగ్లాదేశీయులు అక్రమ పాస్‌పోర్టులు పొందిన విషయం బయటకు వచ్చింది. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన కొందరు తప్పుడు పత్రాలతో పశ్చిమ బెంగాల్‌లో ఆధార్ కార్డులు పొందారు. తప్పుడు చిరునామాలతో బోధన్ నుంచి పాస్‌పోర్టులు సంపాదించారు.

ముగ్గురు మీ సేవా కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఆధార్‌ కార్డుల్లో స్థానిక చిరునామా మార్పించి..పాస్‌పోర్టులు పొందారు. ఇలా ఏడు చిరునామాలతో 72 పాస్‌పోర్టులు జారీ అయినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 46 పాస్‌పోర్టులకు ఐదు ఫోన్‌ నెంబర్లు ఉపయోగించినట్టు వెల్లడయింది. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులను గుర్తించిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు, సైబరాబాద్ పోలీసులు, నిజామాబాద్ పోలీసులు 16 బృందాలుగా ఏర్పడి పాస్‌పోర్ట్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నారు.