Inhuman incident : మామిడికాయలు కోశారని పిల్లల్ని కట్టేసి చితకబాదినవారిపై కేసు నమోదు
మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అమానుష ఘటనపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. తొర్రూర్ మండలం చింతపల్లిలో.. మామిడికాయలు దొంగిలించారంటూ చిన్నపిల్లలపై దారుణంగా వ్యవహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు.

Police Case Registered Over The Inhuman Incident In Mahabubabad
Inhuman incident : మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అమానుష ఘటనపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. తొర్రూర్ మండలం చింతపల్లిలో.. మామిడికాయలు దొంగిలించారంటూ చిన్నపిల్లలపై దారుణంగా వ్యవహరించిన ఘటనపై కేసు నమోదు చేశారు. మామిడితోటలో కాయలు దొంగిలించే ప్రయత్నం చేశారని.. తోటకు కాపలా ఉన్న బానోతు యాకుబ్, బానోతు రాములు ఇద్దరు బాలురను చితక బాదారు. చిన్నారులను స్తంబానికి కట్టేసి వారిపై నీళ్లు పోసి చిత్ర హింసలు పెట్టారు. అంతేకాక పేడను వారి నోటిలో కుక్కి అమానుషంగా ప్రవర్తించారు. ఈ వీడియోను అక్కడే ఉన్నవారు తమ సెల్‌ఫోన్‌లో బంధించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
చింతపల్లికి చెందిన ఇద్దరు బాలురు.. మామిడి తోటలోకి చొరబడి.. కాయలు కోయడానికి ప్రయత్నించారు. ఇది గమనించిన తోట కాపరులు ఆ ఇద్దరినీ.. స్తంభానికి కట్టేసి హింసించారు. అంతటితో ఆగకుండా అమానుషంగా ప్రవర్తించారు. సన్న కర్ర తీసుకొని వారిని బాదారు. పక్కనే ఉండి చూస్తున్న ఇతర వ్యక్తులు కూడా పిల్లలను కొడుతుంటే నవ్వుతూ నిల్చున్నారు.
ఆ ఇద్దరు బాధితుల నోట్లో పేడ కుక్కుతున్నా.. కనీసం వద్దని కూడా చెప్పలేదు. ఆ చిన్నారులు ఏడుస్తూ వదిలేయమని ఎంత వేడుకున్నా వినలేదు ఆ దుర్మార్గులు. ఈ విషయం తెలిసిన బాధితుల తల్లిదండ్రులు.. తమ పిల్లలపై చేయి చేసుకున్న వారిని శిక్షించాలని కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.