దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్..సర్వం సిద్ధం

Poll Management In Dubbaka : దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. దుబ్బాక బరిలో 23 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ.. ఈవీఎం మిషన్లను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు ఎన్నికల ఏర్పాట్లలో ఈసీ బిజీగా ఉండటంతో.. మరోవైపు పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాయి.
దుబ్బాకలో మైకుల మోత ఆగింది. హోరాహోరీగా సాగిన ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. ఓట్ల కోసం జనం చుట్టూ తిరిగిన నేతలు ఇక పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టారు. 2020, అక్టోబర్ 03వ తేదీ మంగళవారం జరిగే ఉపఎన్నికకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నియోజకవర్గంలో లక్షా 98 వేల 756 మంది ఓటర్లున్నారు. 8 మండలాల్లో 315 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
వీటిలో 89 బూత్‌లను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 6వందల మంది పోలింగ్ విధులను నిర్వర్తిస్తున్నారు. 63 ప్రత్యేక పోలీస్ బృందాలతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. 33 ప్రాంతాల్లో 89 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించిన అధికారులు.. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 10 చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
వృద్ధులు, వికలాంగులు ఓటేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. దుబ్బాక నియోజకవర్గంలో 130 మంది కరోనా బాధితులుండటంతో వారు ఓటేసేందుకు ప్రత్యేక సమయం కేటాయించారు అధికారులు. కోవిడ్ పేషెంట్లు కావాలనుకుంటే పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. పార్టీల పోల్ మేనేజ్‌మెంట్‌పైనా ఈసీ దృష్టిసారించింది. ఓటర్లను ప్రలోభపెడితే చర్యలు తప్పవని హెచ్చరించింది. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించాలని అధికారులు సూచించారు.