ఆ అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చేస్తున్నాం.. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మొద్దు: మంత్రి పొన్నం
బలవంతంగా ప్రభుత్వం ఎక్కడా ఇళ్లను కూల్చడం లేదని, ప్రతిపక్షాలు ప్రజలు రెచ్చగొడుతున్నాయన్నారు.

Minister Ponnam Prabhakar
చెరువులో ఉన్న అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చేస్తున్నామని, మూసీ పరివాహక పరిధిలో ఉన్న ఇండ్లను ఖాళీ చేసి వారికి డబుల్ బెడ్ ఇండ్లు కేటాయిస్తామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు.
బలవంతంగా ప్రభుత్వం ఎక్కడా ఇళ్లను కూల్చడం లేదని, ప్రతిపక్షాలు ప్రజలు రెచ్చగొడుతున్నాయన్నారు. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ అని, మూసీని పర్యాటక కేంద్రంగా చేస్తామని మంత్రి తెలిపారు. తప్పుడుగా ఇండ్లకు అనుమతిలిస్తే భవిష్యత్తులో అధికారులపై చర్యలు ఉంటాయని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే ఆస్కారం లేకుండా పోయిందని, ప్రజలను పోలీసులతో కొట్టిచ్చిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. అప్పటి ప్రభుత్వం గౌరవెల్లి మల్లన్న సాగర్ భూ నిర్వాసతులపై లాఠీ ఛార్జి చేయించింది, అలాంటి చర్యలు తమ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదని తెలిపారు.
మరోవైపు, 30 యూనివర్సిటీలు కట్టే బదులు 30 వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేస్తే బాగుండు అన్న కేటీఆర్ ఇప్పుడు అదే పని చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్‌లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వర్షాలు వస్తే హైదరాబాద్ లో నాళాలు మునిగి ప్రజలు అష్టకష్టాలు పడ్డారని అన్నారు.
హైదరాబాద్‌లోని మూసీ, లేక్ సిటి డెవలప్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మూసీ కాల్వ ఇరు వైపులా నివాసం ఉన్న వారిని బలవంతంగా ఖాళీ చేయించడం లేదని అన్నారు. మూసీ బాధితుల పట్ల ప్రతిపక్షాలు, హరీశ్ రావులాంటి నాయకులు రాజకీయం చేస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని చెప్పారు.