Priyanka Gandhi: తెలుగులో నినాదాలు చేసిన ప్రియాంక గాంధీ.. కొడంగల్ సభలో కాంగ్రెస్ శ్రేణుల రియాక్షన్ ఏంటంటే?

కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రియాంక ప్రశంసలు కురిపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని ఆమె తెలుగులోనే సభికులతో కలిసి వినిపించారు.

Priyanka Gandhi: తెలుగులో నినాదాలు చేసిన ప్రియాంక గాంధీ.. కొడంగల్ సభలో కాంగ్రెస్ శ్రేణుల రియాక్షన్ ఏంటంటే?

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా.. సోమవారం కొడంగల్ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకొస్తే భూములు లాక్కుంటారని, ఇప్పటికే ధరణి పోర్టల్ అందుకే తీసుకువచ్చారని విమర్శలు గుప్పించారు.

కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ప్రియాంక ప్రశంసలు కురిపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని ఆమె తెలుగులోనే సభికులతో కలిసి వినిపించారు. ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’ అంటూ ప్రియాంక నినాదాలు చేస్తుంటే సభకు వచ్చిన వారు ఉత్సాహంతో ఆమెతో గొంతు కలిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ సభ కోలాహాలంగా కనిపించింది.

తెలంగాణ ప్రభుత్వంపై ప్రియాంక తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేపర్ లీక్ వ్యవహారం, ధరణి సహా కాళేశ్వరం ప్రాజెక్టు వంటి వాటిపై ఆమె దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు నేటికీ నిలబడి ఉన్నాయని, అయితే కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని ప్రియాంక ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కొడంగల్ ఓటర్లను కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రియాంక ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.