తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఐదు రోజులు భారీ వర్షాలు.. హైదరాబాద్‌లోనూ దంచికొట్టనున్న వానలు

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఐదు రోజులు భారీ వర్షాలు.. హైదరాబాద్‌లోనూ దంచికొట్టనున్న వానలు

Telangana Rains

Updated On : June 14, 2025 / 7:09 AM IST

Telangana Heavy Rains: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు హైదరాబాద్ లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. శుక్రవారం రాత్రి నగరంలోని ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వచ్చే నాలుగు రోజులు హైదరాబాద్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సంసిద్ధమైనట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

శనివారం (14వ తేదీ) నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆదివారం (15వ తేదీ) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
16, 17 తేదీల్లో.. అదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
18వ తేదీన మంచిర్యాల, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.