హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. వాహనదారుల ఇక్కట్లు

Rains In Hyderabad: నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. వాహనదారుల ఇక్కట్లు

Hyderabad Heavy Rain: హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాజేంద్రనగర్, చార్మినార్, గోషామహల్, ఖైరతాబాద్ సర్కిళ్ల పరిధిలో వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం పడుతోంది.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో కుండపోతగా వాన పడుతోంది. గోల్కొండ, నానక్ రాంగూడ, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, శేరిలింగంపల్లి, అంబర్ పేట, నార్సింగి, అత్తాపూర్ ఏరియాల్లో వర్షం పడుతోంది. సెక్రటేరియట్ ఏరియాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. మరో గంట పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

భారీ వర్షాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి. వర్షం భారీగా కురుస్తుండడంతో చాలా మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలో వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.

Also Read: పోలవరంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఐదున్నర సెంటీమీటర్ల వర్షపాతం 
సోమవారం మధ్యాహ్నం 4 గంటల వరకు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీగా వర్షాలు నమోదు అయ్యాయి. గోల్కొండ తాశీల్దార్ కార్యాలయం ప్రాంతంలో ఐదున్నర సెంటీమీటర్లు, లంగర్ హౌస్ ప్రాంతంలో నాలుగున్నర సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఫిలింనగర్ కృష్ణానగర్ షేక్ పేట ప్రాంతాల్లో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. జూబ్లీహిల్స్, అత్తాపూర్ ప్రాంతాల్లో మూడు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు అయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.