“నేను రాజీనామా చేసింది అందుకు కాదు” అంటూ రాజాసింగ్ కామెంట్స్.. రాజీనామా ఆమోదంపై స్పందన
తాను ఎల్లప్పుడూ భక్తి, నిజాయితీతో పని చేస్తానని రాజాసింగ్ అన్నారు.

Rajasingh
బీజేపీ తన రాజీనామాను ఆమోదించడంతో దీనిపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం, తాను భారతీయ జనతా పార్టీలో చేరానని గుర్తుచేసుకున్నారు.
తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నది ఏ పదవి, అధికారం కోసమో కాదని రాజాసింగ్ స్పష్టం చేశారు. తాను హిందూత్వానికి సేవ చేయడానికి పుట్టానని, తన చివరి శ్వాస వరకు హిందూత్వం కోసం పని చేస్తూనే ఉంటానని తెలిపారు.
ప్రజలకు, దేశానికి సేవ చేయడం, హిందూత్వాన్ని రక్షించడం అనే లక్ష్యాలతో అప్పట్లో తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని రాజాసింగ్ అన్నారు. బీజేపీ తనను నమ్మి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గోషామహల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని తెలిపారు. తనను నమ్మినందుకు బీజేపీకి అధికారులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.
ఇవాళ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన రాజీనామాను ఆమోదించారని రాజాసింగ్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కలతో పగలు, రాత్రి పనిచేస్తున్న లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల బాధను తాను ఢిల్లీకి తెలియజేయలేకపోవచ్చని అన్నారు.
హిందూత్వం, జాతీయత, సనాతన ధర్మాన్ని రక్షించడానికి తాను ఎల్లప్పుడూ పూర్తి భక్తి, నిజాయితీతో పని చేస్తానని రాజాసింగ్ అన్నారు. తన చివరి శ్వాస వరకు సమాజ సేవ, హిందూ సమాజ హక్కుల కోసం తన గొంతుకను వినిపిస్తూనే ఉంటానని చెప్పారు.