Rajiv Yuva Vikasam scheme: ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకు రూ.3 లక్షలు.. 15 నుంచి అప్లికేషన్స్.. ఇలా అప్లై చేసుకోండి..
మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

తెలంగాణలోని నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ సర్కారు ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం కింద రూ.3 లక్షల వరకు యువతకు సాయం చేయనున్నారు. తెలంగాణలో మొత్తం 5 లక్షల మంది కోసం ఈ పథకం కింద రూ.6,000 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక ఏడాది నుంచే దీన్ని అమలుచేస్తామన్నారు. ఆయా కార్పొరేషన్లు దరఖాస్తులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తాయన్నారు. యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
ముఖ్యమైన తేదీలు
- మార్చి 15న పూర్తి వివరాలతో పథకానికి సంబంధించిన నోటిఫికేషన్
- మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు
- ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక
- అర్హులకు జూన్ 2న మంజూరు పత్రాలు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అప్లై చేసుకోవాలి
- మార్చి 15న ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి
జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో అధికారుల కమిటీ అర్హులను సెలెక్ట్ చేసి తుది జాబితాను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4,200 మందికి చొప్పున లబ్ధి చేకూరుతుంది. ఈ పథకానికి బ్యాంకు లింకేజీని పెడుతున్నారు.
పథకంలో ఏయే యూనిట్లు ఉండాలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ఆయా యూనిట్ల వారీగా రేటును నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఒక యూనిట్ ఖర్చు రూ.7 లక్షలు ఉంటే, అందులో రూ.3 లక్షలు సర్కారు ఇస్తుంది. మిగతా డబ్బును బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుత ఆర్థిక ఏడాది బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు రూ.2,500 కోట్లు కేటాయించారు అలాగే, ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి పథకాల కోసం రూ.2,136 కోట్ల కేటాయింపు జరిగింది. ట్రైకార్‌లో స్వయం ఉపాధి పథకాలకు రూ.657.96 కోట్లను కేటాయించారు. ఇక మైనార్టీ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్ల కేటాయింపు జరిగింది. వీటిని రాజీవ్‌యువ వికాసం స్కీమ్‌కి వాడతారు.