రాజకీయాల్లో రాములమ్మ మళ్లీ యాక్టివ్ కాబోతున్నారా? ఆమె కాంగ్రెస్ సర్కార్‌లో ఏదైనా పదవిని ఆశిస్తున్నారా?
స్థానికంగా సీఎం, పీసీసీ చీఫ్‌లను సంప్రదించకుండా రాహుల్ గాంధీని కలిసి విజయశాంతి ఏం చెప్పబోతున్నారు? రాహుల్‌ను ఏం కోరబోతున్నారన్నది చర్చనీయాంశమవుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, ప్రముఖ సినీ నటి విజయశాంతి మళ్లీ రాజకీయంగా బిజీ కావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఏకంగా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు టాక్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 నవంబర్‌లో బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు రాములమ్మ.
ఆమెను కాంగ్రెస్ అధిష్టానం ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, కన్వీనర్‌గా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు విజయశాంతి. ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా ఇప్పటివరకు సైలెంట్‌గానే ఉన్నారు. పొలిటికల్‌గా ఎక్కడా యాక్టివ్‌గా కనిపించడం లేదు రాములమ్మ.
లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో కూడా విజయశాంతి ఎక్కడా కనిపించలేదు. అయితే రాములమ్మ రాజకీయాల్లోకి యాక్టివ్‌గా లేకపోవడానికి చాలా కారణాలున్నాయంటున్నారు ఆమె సన్నిహితులు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని అగౌరవపర్చిందంటున్నారు. ఆమెకు తగిన గౌరవం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది.
అధికారంలోకి వచ్చాక తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లభించకపోవడం వల్లే ఆమె సైలెంట్ అయిపోయారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ వస్తున్నారు రాములమ్మ.
నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారా?
సరిగ్గా ఇదే సమయంలో విజయశాంతి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరడం ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల క్రితం విజయశాంతి రాహుల్ గాంధీని కలిసేందుకు టైమ్ కోరినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుండగా..ఇ న్నాళ్లూ సైలెంట్‌గా ఉండి, ఇప్పుడు సడెన్‌గా విజయశాంతి రాహుల్ గాంధీని ఎందుకు కలవాలనుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
రాములమ్మ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నారా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. లేదంటే ఏదైనా నామినేటెడ్ పదవిని ఆశిస్తున్నారా అని చర్చించుకుంటున్నారు నేతలు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కాదని నేరుగా ఢిల్లీలో రాహుల్ గాంధీని కలవాలనుకుంటున్న విజయశాంతి ఆంతర్యం ఏమై ఉంటుందన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొందట.
స్థానికంగా సీఎం, పీసీసీ చీఫ్‌లను సంప్రదించకుండా రాహుల్ గాంధీని కలిసి విజయశాంతి ఏం చెప్పబోతున్నారు.? రాహుల్‌ను ఏం కోరబోతున్నారన్నది చర్చనీయాంశమవుతోంది. అంతేకాదు విజయశాంతికి రాహుల్ అపాయింట్ మెంట్ ఇస్తారా లేదా అన్నది కూడా కాంగ్రెస్ నేతల్లో ఆసక్తిరేపుతోంది. ఏడాది పాటు సైలెంట్‌గా ఉండి..ఇప్పుడు రాహుల్ గాంధీని కలవానుకోవడం వెనుక రాములమ్మ వ్యూహం ఏంటన్నది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. అయితే ఆమెకు రాహుల్ అపాయింట్‌మెంట్ ఇస్తారా.. ఇస్తే ఏయే అంశాలపై చర్చించబోతున్నారన్నది మాత్రం మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఐదోసారి ముఖ్యమంత్రి అవుతా- అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..