COVID-19 : Telangana లో తగ్గుతున్న కరోనా

Corona Virus in Telangana : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణలో తగ్గుముఖం పడుతోంది. టీపీఆర్ తగ్గుతుండడం..రికవరీ రేటు పెరుగుతోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ భారతదేశంలో ఉగ్రరూపం దాల్చింది. తొలుత తెలంగాణలో అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం వంద మందిలో కేవలం నలుగురు మాత్రమే వైరస్ బారిన పడుతున్నారు. మార్చి 2న రాష్ట్రంలోకి ఈ వైరస్ వచ్చింది. దీని కారణంగా…1.85 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడ్డ 1,100 మంది మరణించారు. జూన్, జూలైలో వైరస్ ఉగ్రరూపం దాల్చింది. అయితే..రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రజల సహకారంతో వైరస్ కు అడ్డుకట్ట పడింది.
జూన్ నెలలో పరీక్ష చేసిన ప్రతి వంద మందిలో 72 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, ఆగస్టు చివరి నాటికి జరిపిన ప్రతి వంద పరీక్షల్లో 10 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. సెప్టెంబర్ 26 నాటికి నలుగురికే పరిమితమైంది.
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తుండడంతో కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేసింది.
అనంతరం కొన్ని కొన్ని రంగాలకు అనుమతులిచ్చింది. కరోనా అంటేనే తొలుత భయపడిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ధైర్యం తెచ్చుకుంటున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహించుకుంటూ బిజీ బిజీగా మారిపోయారు. వైరస్‌వ్యాప్తి, లక్షణాలు, చికిత్సపై అవగాహన పెరుగడంతో అప్రమత్తంగా ఉంటున్నారు.
ఇప్పటివరకు వైరస్ బారిన పడినవారిలో 1.54లక్షల మంది కోలుకోగా, 30 వేల మంది దాకా ఇంట్లో, దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. నిత్యం కొత్త కేసుల కంటే, కోలుకుంటున్న వారే ఎక్కువ ఉంటున్నారు.