Rekha Nayak: కంటతడి పెడుతూ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఎమ్మెల్యే రేఖా నాయక్.. ఎందుకంటే?
తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. తన నియోజక వర్గ ప్రజలు అందరూ...

Rekha Nayak
Khanapur: బీఆర్ఎస్ పార్టీకి నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రాజీనామా చేశారు. ఆ సమయంలో కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశానని అన్నారు.
బీఆర్ఎస్ అధిష్ఠానం కక్షపూరితంగా నిధులు ఆపేసిందని ఆరోపించారు. తాను ఏ పార్టీలో చేరతానన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని అన్నారు. బీఆర్ఎస్ ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అసలు స్థానికుడే కాదని చెప్పారు. ఆయనకు ఏ ప్రాతిపదికన బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని నిలదీశారు.
బీఆర్ఎస్ లో మహిళలకు ప్రాధాన్యం లేదని చెప్పారు. ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగానే ఆపేశారని తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. తన నియోజక వర్గ ప్రజలు అందరూ తనతోనే ఉన్నారని చెప్పారు.
కేటీఆర్ దోస్తు జాన్సన్ నాయక్ కోసం ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని రేఖా నాయక్ అన్నారు. ఈ నియోజక వర్గంలో బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించేలా కృషిచేస్తానని చెప్పారు. తాను ఏదైనా స్కామ్, తప్పు చేసుంటే నిరూపించాలని సవాలు విసిరారు. ఎస్టీ నియోజక వర్గంలో క్రిస్టియన్ కి టికెట్ ఎలా కేటాయిస్తారని నిలదీశారు. కేసీఆర్ చేసిన వాగ్దానాలన్నీ వట్టి మాటలేనని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖానాపూర్ నుంచి టికెట్ దక్కకపోవడంతో రేఖానాయక్ కాంగ్రెస్ లో చేరనున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
Revanth Reddy: బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంకి కలిపి 36 సీట్లు వస్తాయి.. కాంగ్రెస్‌కేమో..: రేవంత్ రెడ్డి