ఖమ్మం నుంచి పోటీ చేస్తా.. ఇంకెవరికీ చాన్స్ లేదు: రేణుకా చౌదరి
ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో తనకు తప్ప ఎవరికీ చాన్స్ లేదని వ్యాఖ్యానించారు.

Renuka Chowdhury ready to contest in Khammam if Sonia Gandhi not contest
Renuka Chowdhury: ఖమ్మం లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని తానేనని సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం పార్లమెంటుకి పోటీ చేస్తానని, తాను సీటు అడిగితే కాదనేవారు లేరని చెప్పారు. గురువారం ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీ చేయాలని కోరామని, ఆమె నిర్ణయం వెల్లడించే వరకు ఓపికతో ఉండాలని కార్యకర్తలకు సూచించారు. సోనియా గాంధీ పోటీ చేయకపోతే అభ్యర్థిని తానేనని, ఇంకెవరికీ పోటీ చేసే చాన్స్ లేదని స్పష్టం చేశారు.
బీజేపీ సర్టిఫికేట్ అవసరం లేదు
అయోధ్య రామమందిరాన్ని ఎన్నికల కోసం వాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ఆలయ నిర్మాణం పూర్తి కాకముందే ప్రాణప్రతిష్ఠ చేయడం సరికాదని రేణుకా చౌదరి అన్నారు. తన దృష్టిలో హిందువుగా పుట్టడం అదృష్టమని, తనకు బీజేపీ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. ”అయోధ్యకు మీరు ఆహ్వానిస్తే వెళ్లాల్సిన అవసరం లేదు. నా ఇష్టం వచ్చిన ప్పుడు వెళ్తాం. మీ అనుమతులు అవసరం లేదు. మీ సర్టిఫికేట్ అవసరం లేద”ని వ్యాఖ్యానించారు. ఈ నెల 22 తరువాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు.
Also Read: తెలంగాణలో పెరిగిన ఓటు బ్యాంకు.. హ్యట్రిక్ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్న బీజేపీ
ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం
అసెంబ్లీ ఎన్నికల్లో హామీయిచ్చినట్టుగా వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ సమస్య పైనే రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిందని, ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిదని తెలిపారు. ఉద్యోగం లేకపోతే యువతకు పెళ్లిళ్లు కావడం లేదన్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఖమ్మం అభివృద్ధికి పాటుపడతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై పువ్వాడ అజయ్ కేసులు పెట్టారని, ఆయన సాగించిన భూఅక్రమాలపై పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పదవులు లేకుండా ఉన్నారని, వారికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.