CM Revanth Reddy : ముఖ్యమంత్రిగా నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే?

రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు.. తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందుకూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు.

CM Revanth Reddy : ముఖ్యమంత్రిగా నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్.. ఏమన్నారంటే?

Revanth Reddy

Updated On : January 7, 2024 / 11:34 AM IST

Telangana CM Revanth Reddy : తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి నెల రోజులు అయింది. ఈనెల రోజుల పాలనలో రేవంత్ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలనలో తనదైన మార్క్ ను చూపిస్తూ ముందుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా నెల రోజుల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా తన నెలరోజుల పాలనపై రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : Telangana Congress Party : పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాంకు చాన్స్

సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈనెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందని రేవంత్ అన్నారు. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని తెలిపారు. పేదల గొంతుక వింటూ… యువత భవితకు దారులు వేస్తూ… మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ… రైతుకు భరోసా ఇస్తూ… సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోందని రేవంత్ ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read : CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చైర్మ‌న్‌గా రేవంత్ రెడ్డి.. కమిటీలో 25 మందికి చోటు

పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ… పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ… నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ… మత్తులేని ఛైతన్యపు తెలంగాణకోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగిందని అన్నారు. రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్నారు.. తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందుకూడా నా బాధ్యత నిర్వర్తిస్తానని రేవంత్ రెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. చివరిలో మీ రేవంతన్న అంటూ రాశారు.