Telangana Congress Party : పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాంకు చాన్స్
త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. కార్పొరేషన్ల భర్తీ, కేబినేట్ విస్తరణ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల భర్తీలను ఈ నెలాఖరులోగా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

Revanth Reddy
Loksabha Elections 2024 : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానుండటంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పీసీసీ చీఫ్‌గా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండటంతో పార్లమెంట్ ఎన్నికల్లో మంచి రిజల్ట్ సాధించాలని చూస్తున్నారు. అందుకోసం కార్పొరేషన్ల భర్తీ.. ఎమ్మెల్సీల భర్తీలను చకచకా చేయాలని చూస్తున్నారు. కేబినేట్ విస్తరణకూడా పార్లమెంట్ ఎన్నికల్లోపే పూర్తి చేయాలని భావిస్తున్నారు. నెలరోజుల్లో కేబినేట్ విస్తరణ, గవర్నర్ కోటా, కార్పొరేషన్ల భర్తీని చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు.
Also Read : AP Congress : షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై సజ్జల సంచలన వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఏపీ కాంగ్రెస్
టార్గెట్ 30 డేస్ ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ 30 డేస్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానుండటంతో మంచి ఫలితాలు సాంధించాలనే లక్ష్యంతో వెళ్తున్నారు. అందులో భాగంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా మంది టికెట్లు ఆశించిన వారికి పార్టీ అధికారంలోకివస్తే న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఈలోపు కార్పొరేషన్లతో నేతలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. జనవరి 31లోపు కార్పొరేషన్లను భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. నేతలకు కార్పొరేషన్ల బాధ్యతలు ఇస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించవచ్చనే ఆలోచనతో ఉన్నారు.
Also Read : YS Sharmila : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల
త్వరలో కేబినెట్ విస్తరణ ..
కేబినేట్ విస్తరణ పూర్తి చేయాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కేబినేట్ సీఎంతో కలిసి 18 మందికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా ఆరు మందికి కేబినేట్‌లో అవకాశం కల్పించే చాన్స్ ఉంది. అయితే, కేబినేట్ విస్తరణ పూర్తిగా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ముందుకువెళ్లే ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గానికి కూడా కేబినేట్‌లో అవకాశం కల్పించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలుగా ముస్లింలు ఒక్కరుకూడా గెలవలేదు. దీంతో గవర్నర్ కోటాలో రెండు స్థానాలు.. ఎమ్మెల్యేల కోటాలో రెండు ఖాళీలున్నాయి. ఈ నాలుగు స్థానాల్లో ఒక్క ముస్లింకు అవకాశం కల్పించి.. కేబినేట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యంలేని జిల్లాలకు కూడా అవకాశం కలిగే ఛాన్స్ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ జిల్లాల నుంచి కేబినేట్‌లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read : టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన ఆదేశాలు
ఎమ్మెల్సీగా కోదండరాంకు అవకాశం..
సీఎం రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తీసుకునే ప్రతీ నిర్ణయంతో పొలిటికల్ మైలేజ్ వచ్చేలా చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేసిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంకు ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాల్లో ఒకటి కోదండరాంకు ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల తెలంగాణ ఉద్యమ కారులకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. మరోవైపు కోదండరాం విషయంలో గవర్నర్ నుంచికూడా పెద్దగా ఇబ్బందులు ఉండవనే ఆలోచన చేస్తున్నారు.
మొత్తంమీద పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. కార్పొరేషన్ల భర్తీ, కేబినేట్ విస్తరణ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల భర్తీలను ఈ నెలాఖరులోగా భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.