RTI War : బీజేపీ-టీఆర్ఎస్ మధ్య హీట్ పెంచిన ఆర్టీఐ వార్

తెలంగాణలో పాలిటిక్స్‌లో ప్రస్తుతం ఆర్టీఐ వార్‌ నడుస్తోంది. సీఎం కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఆర్టీఐ అస్త్రాలను ప్రయోగిస్తే.. ఇప్పుడు గులాబీ దళం అదే అస్త్రంతో కమలనాథులపై రివర్స్‌ అటాక్‌ చేసేందుకు రెడీ అయ్యింది.

RTI War : బీజేపీ-టీఆర్ఎస్ మధ్య హీట్ పెంచిన ఆర్టీఐ వార్

Bjp Trs War

Updated On : July 8, 2022 / 9:01 AM IST

RTI War :  తెలంగాణలో పాలిటిక్స్‌లో ప్రస్తుతం ఆర్టీఐ వార్‌ నడుస్తోంది. సీఎం కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ఆర్టీఐ అస్త్రాలను ప్రయోగిస్తే.. ఇప్పుడు గులాబీ దళం అదే అస్త్రంతో కమలనాథులపై రివర్స్‌ అటాక్‌ చేసేందుకు రెడీ అయ్యింది. ఆర్టీఐ చట్టం కింద ఎనమిదేళ్ల కాలంలో 88 అంశాలపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, అమలు చేసిన పథకాలు, అమలు చేయాల్సినవి, ఇప్పటివరకు చేసిన ప్రభుత్వ ఖర్చులపై సమాచారాన్ని కోరుతూ దరఖాస్తులు దాఖలు చేశారు బండి సంజయ్. ఆర్టీఐ ద్వారా పక్కా ఆధారాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయాలనుకుంటున్న బీజేపీ తీరుపై ఇప్పుడు తెలంగాణలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇదే సమయంలో.. బీజేపీకి కౌంటరిస్తోంది టీఆర్ఎస్.. ప్రగతి భవన్‌ నిర్మాణ ఖర్చు, సీఎం కేసీఆర్‌ జీత భత్యాలు, పర్యటన ఖర్చులతో సహా హామీలులాంటి 88 ఆర్టీఐ దరఖాస్తులను బండి సంజయ్ దాఖలు చేస్తే.. ప్రధానమంత్రి మోదీని టార్గెట్‌ చేస్తూ టీఆర్‌ఎస్‌ అప్లికేషన్లు దాఖలు చేస్తోంది. వంద అంశాలపై ఆర్‌టీఐకి దరఖాస్తు చేశారు టీఆర్ఎస్ నేతలు.

మీ జీతభత్యాలెంత.. ఆయనేసుకున్న బట్టల ఖర్చెంత.. రాష్ట్రాల పర్యటనకు అయిన లెక్కలేంటి.. విదేశీ టూర్లకు వెచ్చించిన మొత్తమెంత.. ఎవరో లెక్కలేసుకోవడం కాదు.. జమా ఖర్చుల లెక్కలసలే కాదు. బీజేపీ వేసిన ఆర్టీఐలకు టీఆర్ఎస్ అదే రేంజ్‌లో కౌంటరిస్తోంది. ప్రధాని పర్యటనల నుంచి.. యుక్రెయిన్ యుద్ధం వరకు.. మోదీ డ్రెస్సుల నుంచి అప్పుల వరకు లెక్కలడుగుతోంది.

ప్రగతి భవన్‌ నిర్మాణానికి ప్రభుత్వం చేసిన ఖర్చెంత అని బిజేపీ అడిగితే.. రష్యా-యుక్రెయిన్‌ యుద్ధాన్ని మోదీ ఆపారా అంటూ టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. సీఎం కేసీఆర్ జీతభత్యాలపై కమలం పార్టీ లెక్కలడిగితే.. మోదీ డ్రెస్సింగ్ స్టైల్‌కు ఎంత ఖర్చైంది అని టీఆర్ఎస్ నిలదీస్తోంది. సీఎం కేసీఆర్ రాష్ట్రాల పర్యటనకు అయిన మొత్తం ఎంత అని బండి సంజయ్ లెక్కలడిగితే.. మోదీ విదేశీ పర్యటనల ఖర్చెంత అని టీఆర్ఎస్ నేతలు ఆరా తీస్తున్నారు. 2 జూన్ 2014నుంచి 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంత అని కమలం పార్టీ నేతలు అడిగితే.. 2014 వరకు దేశానికి ఉన్న అప్పు ఎంత.. ప్రస్తుతం ఎంత అప్పు ఉందో వివరాలు చెప్పాలంటూ ఆర్టీఐ కింద చేసిన దరఖాస్తుల్లో టీఆర్ఎస్ నేతలు వివరాలడిగారు.

ఓవైపు ఆర్టీఐ వార్ కొనసాగుతోండగానే.. టీఆర్‌ఎస్‌పై ముప్పేట దాడికి సిద్ధమవుతోంది బీజేపీ. సాలు దొర- సెలవు దొర క్యాంపెయిన్‌ను మరింత ఉధృతం చేసేందుకు రెడీ అయింది. సోషల్‌ మీడియాను హోరెత్తించాలని బీజేపీ నిర్ణయించింది. సాలు దొర-సెలవు దొర హోర్డింగ్‌లను తెలంగాణ వ్యాప్తంగా పెట్టి.. టీఆర్‌ఎస్‌ కవ్వింపులకు పోటీగా రాష్ట్రవ్యాప్త ప్రచారం చేయాలని డిసైడ్ అయింది. ఓవైపు టీఆర్ఎస్‌ సాలు మోదీ-సంపకు మోదీ క్యాంపెయిన్‌ నడిపిస్తోంది. దీంతో బీజేపీ దూకుడు పెంచింది. మొత్తంగా ఆర్టీఐ ద్వారా అడిగిన సమాచారం పూర్తిగా వస్తుందా రాదా అనే విషయాన్ని పక్కనబెడితే.. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు ఓ రేంజ్‌లో పొలిటికల్ హీట్‌ను పెంచేస్తున్నాయి.

Also Read : Heavy Rains : ఏపీలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు