పనిలో చేరి నెలరోజులే.. ఇంకా జీతం కూడా తీసుకోలేదు.. కొడుకు కడసారి చూపుకోసం అప్పుచేసి విమానమెక్కి వచ్చిన తండ్రి.. కన్నీరు మున్నీరవుతూ..
పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన పేలుడు ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారు.

Pashamylaram
pashamylaram incident: పటాన్ చెరు మండలం పాశమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన పేలుడు ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 39 మంది మృతి చెందారు. ఇందులో అజయ్ మండల్ (19) కూడా ఉన్నాడు. అజయ్ మండల్ ది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ ప్రాంతం. అక్కడ పనిదొరక్క పోవడంతో తెలిసిన వారి సహాయంతో నెల కిందటే పాశమైలారం వచ్చాడు.
ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. దీంతో డీఎన్ఏ టెస్టు ద్వారా మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో డీఎన్ఏ పరీక్షల కోసం వెంటనే రావాలని అధికారులు చెప్పడంతో అజయ్ మండల్ తండ్రి సుభాష్ హైదరాబాద్ వచ్చాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ తన కొడుకును కడసారి చూపు కోసం పాశమైలారం వచ్చాడు.
పాశమైలారం ఘటన తరువాత తన కొడుకుకోసం బంధువుల సహకారంతో సుభాష్ అధికారులను సంప్రదించాడు. డీఎన్ఏ టెస్టు కోసం త్వరగా రావాలని అధికారులు సూచించారు. డెడ్ బాడీ కుళ్లిపోయే అవకాశం ఉందని, వెంటనే రావాలని అధికారులు సూచించారు. దీంతో కొడుకు మృతదేహాన్ని కడసారి చూసుకునేందుకు తెలిసిన వారి వద్ద రూ.30వేలు అప్పు చేసి, మరొకరి సాయంతో విమానం టికెట్టు తీసుకొని హైదరాబాద్ వచ్చాడు. గురువారం సాయంత్రం డీఎన్ఏ టెస్టు కోసం రక్తం ఇవ్వగా.. అధికారులు అజయ్ డెడ్ బాడీని గుర్తించారు. మాంసం ముద్దగా మారిన కొడుకు మృతదేహాన్ని చూసి ఆ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు.
మృతుడు అజయ్ మండల్ తండ్రి సుభాష్ మాట్లాడుతూ.. తెలిసినవారి సహాయంతో నా కొడుకు నెల కిందటే పాశమైలారం వచ్చాడని, ఇక్కడ సిగాచి పరిశ్రమలో సుమారు 20 రోజుల క్రితం కార్మికునిగా చేరాడని తెలిపాడు. ఇంకా నెల జీతం కూడా తీసుకోలేదని, అంతలోనే ఈ దుర్ఘటన జరిగిందంటూ కన్నీటి పర్యాంతమయ్యాడు.