Saraswati Pushkaralu: దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతీ పుష్కరాలు.. పురాణాల ప్రకారం..

సరస్వతీ నది పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం పుష్కరాల కోసం ముస్తాబైంది.

Saraswati Pushkaralu: దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతీ పుష్కరాలు.. పురాణాల ప్రకారం..

saraswati pushkaralu kaleshwaram

Updated On : May 15, 2025 / 10:36 AM IST

Saraswati Pushkaralu: సరస్వతీ నది పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం పుష్కరాల కోసం ముస్తాబైంది. బుధవారం రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో పుష్కర కాలం మొదలవుతుంది. 15వ తేదీ గురువారం సూర్యోదయం నుంచి ఈనెల 26వ తేదీ వరకు 12రోజులుపాటు పుష్కరాలు కొనసాగుతాయి. ఉత్తరాదిలో ప్రయాగ వద్ద, దక్షిణ భారతదేశంలో కేవలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాత్రమే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది.

 

తెలంగాణ ఏర్పాటు తరువాత తొలిసారి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరిస్తారు. ముఖ్యమంత్రి రాకకోసం హెలీప్యాడ్ తయారైంది. కాన్వాయ్ ద్వారా సరస్వతీ ఘాట్ కు చేరుకునేలా ఇరువైపులా బారికేడ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. పుష్కరాలను రాష్ట్ర పండుగ మాదిరిగా నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. దేశం నలుమూలల నుంచి పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు రూ.35కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే పుష్కరాల మొబైల్యాప్, వెబ్ సైట్ రెడీ చేసింది. ఈ పుస్కరాలకు రోజు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతంలో 2013లో సరస్వతి పుష్కరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి పుష్కరాలు ఇవే కావడం గమనార్హం.

 

కాళేశ్వరంలోనే ఎందుకంటే..?
దక్షిణ భారతదేశంలో ఒక్క కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతుండటం విశేషం. కాళేశ్వరంలో ఒకే పానవట్టం మీద శ్రీ కాళేశ్వర స్వామి (యముడు), శ్రీ ముక్తీశ్వర స్వామి (శివుడు) రెండు లింగరూపాల్లో వెలిశారు. ముక్తీశ్వరస్వామి లింగానికి రెండు నాసికారంద్రాలు ఉంటాయి. ఈ రంద్రాల్లో అభిషేకం చేస్తున్నప్పుడు ఎంత నీరు పోసినా ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా భూమిలోపలి నుంచి ప్రవహించి సరస్వతీ నది రూపంలో గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తోంది. ఈ మూడు నదులు కలవడం వల్లనే కాళేశ్వరం త్రివేణి సంగమంగా విలసిల్లుతోంది. అంతర్వాహిని అయినా సరస్వతీ నదీ పుష్కరాలు 12ఏళ్లకు ఒకసారి కాళేశ్వరం దగ్గర జరుగుతాయి. పుష్కర స్నానం చేసిన తరువాత శ్రీ మహా సరస్వతి దేవిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు. దీంతో కాళేశ్వరంలో ప్రభుత్వం ఏకశిలతో తయారు చేసిన 17 అడుగుల సరస్వతీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.

 

దేశంలో ఎక్కడెక్కడ ఈ పుష్కరాలు జరుగుతాయి..
సరస్వతీ నది ఉత్తరాఖండ్ రాష్ట్రం బద్రీనాథ్ దగ్గరలోని ‘మన’ అనే గ్రామంలో పుట్టింది. పురాణాల ప్రకారం, సరస్వతి నది ఈ ప్రదేశంలో భూగర్భంలోకి ప్రవహించి ఈ ప్రాంతంలో ఉద్భవించిందని నమ్ముతారు. ఈ నది అంతర్వాహినిగా పేర్కొంటారు. అందువల్ల సరస్వతీ నదీ పుష్కరాలు ‘మనలో’ జరుగుతాయి. అదేవిధంగా.. సరస్వతీ నది.. అలకనంద నదికి ఉపనది. కేశవ ప్రయాగ దగ్గర అలకనందలో కలుస్తుందంటారు. అలాగే సరస్వతీ నది అంతర్వాహినిగా… ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో, గుజరాత్‌లోని సోమనాథలోని త్రివేణీ సంగమాల్లో, రాజస్థాన్‌లోని పుష్కర్‌లో కలుస్తుందనే విశ్వాసం ఉంది. ఆ ప్రాంతాల్లో కూడా పుష్కరాలను నిర్వహిస్తున్నారు.