Telangana: కోవిడ్ భయంలోనే తెలంగాణలో స్టార్ట్ అవుతోన్న స్కూళ్లు

తెలంగాణలో వచ్చే నెల(సెప్టెంబర్) నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. విద్యాసంస్థలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాయి.

Telangana: కోవిడ్ భయంలోనే తెలంగాణలో స్టార్ట్ అవుతోన్న స్కూళ్లు

Schools

Updated On : August 28, 2021 / 8:03 AM IST

Telangana: తెలంగాణలో వచ్చే నెల(సెప్టెంబర్) నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. విద్యాసంస్థలు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాయి. కోవిడ్ భయం వెంటాడుతున్నందున పేరెంట్స్ అనుమతి తప్పనిసరి చేసింది ప్రభుత్వం. దీంతో ఆన్‌లైన్‌ క్లాసులు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫ్‌లైన్ క్లాసులకు రాలేనివారికి ఆన్‌లైన్‌లో కూడా క్లాసులు అందుబాటులో ఉండేలా స్కూళ్లు ఏర్పాట్లు చేస్తున్నాయి.

కోవిడ్ కారణంగా మూతబడిన విద్యాసంస్థలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తెరుచుకోబోతున్నాయి. ఇంకా వైరస్ అంతం కాకపోయినప్పటికీ స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించగా.. కొంతమంది తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. తల్లిదండ్రులు అనుమతి ఇవ్వని పక్షంలో ఆన్‌లైన్‌ తరగతులు యథావిధిగా కొనసాగించనున్నాయి ప్రైవేట్ విద్యాసంస్థలు.

ప్రభుత్వ బడుల్లో ఆన్‌లైన్‌ తరగతులు T సాట్, యాదగిరి ద్వారా కొనసాగుతాయని గతంలోనే ప్రకటించారు. అయితే ప్రీ ప్రైమరీ, ప్రైమరీ సెక్షన్స్‌కు మాత్రం ప్రత్యక్ష తరగతులకు కొంత సమయం తీసుకోవాలని కొంతమంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. కోవిడ్ థర్డ్‌ వేవ్ భయం వెంటాడుతున్నందున పై తరగతులకు క్లాసులు జరిగిన కొన్ని రోజులకు పరిస్థితి బాగుంటే, కింది తరగతి పిల్లలకు క్లాసులు నిర్వహిస్తారు. ఇంకా జనాల్లో కోవిడ్ భయం ఉన్నందున ప్రైమరీ క్లాసుల నిర్వహణకు పేరెంట్స్‌ నుంచి మిశ్రమ స్పందన వస్తోందని అంటున్నారు అధికారులు.

మరోవైపు స్కూళ్లలో ఐదుగురికి పాజిటివ్ వస్తే, పాఠశాల మూసేయాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది. తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని కూడా చెప్పడంతో ప్రైవేట్ పాఠశాలలు పేరెంట్స్‌ను అనుమతి పత్రం అడుగుతున్నారు. ఇక విద్యాసంస్థలు కూడా వైరస్ ముప్పు వాటిల్లకుండా ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌, భౌతిక దూరం ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.