జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ – ఓటింగ్

e-voting in GHMC elections 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఈ – ఓటింగ్ అమలు చేయనున్నారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బంది, క్వారంటైన్ లో ఉన్న ఓటర్లు, వయో వృద్ధులకు ఓటు హక్కు కల్పించనుంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఈ – ఓటింగ్ సాఫ్ట్ వేర్ ను రూపొందించాలని ఐటీ శాఖను ఈసీ కోరింది. మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకుని ఉత్తర్వులు జారీ చేయాలని ఈసీ సూచించింది. ఈ ఓటింగ్ విధానం వల్ల ఎలాంటి అనుభవం వస్తుందో..ఇతర ఎన్నికల్లో ప్రయోగపెట్టాలని భావిస్తోంది.
2020, నవంబర్ 02వ తేదీ మంగళవారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో సెంటర్ ఫర్ గుడ్ గవర్ననెన్స్, ఐటీ శాఖ అధికారులతో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పార్థసారధి సమావేశమయ్యారు. ఈ – ఓటింగ్ విధానంపై సమగ్రంగా చర్చించారు. ఇందులో వచ్చిన అనుభవాలను, సక్సెస్ రేట్ ను దృష్టిలో పెట్టుకుని త్వరలో రానున్న వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఈ ఓటింగ్ ను ప్రయోగించాలని యోచిస్తోంది.
ఎన్నికల సమయంలో…వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడం ఇబ్బందిగా మారుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. కొంతమంది కుటుంబసభ్యులు వాహనాల్లో తీసుకరావడం, ఓటు వేయించడం కష్టంగా ఉంటోంది. ఈ క్రమంలో ఈ – ఓటింగ్ విధానం అమల్లోకి వస్తే..చాలా మేలు జరుగుతుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో డెమో ఇవ్వాలని కోరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పేర్కొన్నారు.