Uppal Stadium : హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు షాక్..! అసలేం జరిగిందంటే..
ఉప్పల్ స్టేడియానికి 15 రోజుల క్రితమే నోటీసులు పంపించామని హబ్సిగూడ విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

Uppal Stadium Power Cut
Uppal Stadium : హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కష్టాలు చుట్టుముట్టాయి. కొన్ని నెలల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేశారు. కాగా, రేపు(ఏప్రిల్ 5) ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్, చెన్నై మధ్య కీలక మ్యాచ్ కు ముందు ఉప్పల్ స్టేడియానికి అధికారులు కరెంట్ కట్ చేయడం కలకలం రేపుతోంది. కొన్ని నెలల నుంచి ఉప్పల్ స్టేడియం విద్యుత్ బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపైన విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. బిల్లులు చెల్లించకుండా కోటి 67లక్షల రూపాయల విలువైన విద్యుత్ వాడుకున్నారని విద్యుత్ శాఖ ఆరోపించింది. ఉప్పల్ స్టేడియానికి 15 రోజుల క్రితమే నోటీసులు పంపించామని హబ్సిగూడ విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఐపీఎల్ టోర్నీలో భాగంగా రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, చెన్నై జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చాలా ప్రతిష్టాత్మకం. ఇలాంటి సమయంలో ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్ చేయడం పట్ల క్రికెట్ లవర్స్ మండిపడుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై మరోసారి క్రికెట్ లవర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా కరెంట్ బిల్లులు చెల్లించకపోవడంతోనే స్టేడియానికి ఇవాళ కరెంట్ కట్ చేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. గతంలోనూ ఇలానే కరెంట్ కట్ చేయడంతో అప్పట్లో కొంత బిల్లులు చెల్లించారు.
ఇంకా కోటి 67 లక్షల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు క్లియర్ చేయాలని 15 రోజుల క్రితమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జగన్ మోహన్ రావుకి నోటీసులు కూడా ఇచ్చారు. కానీ, ఇప్పటివరకు ఆ నోటీసులపై స్పందించకపోవడంతో ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫర్ బంద్ చేశామని అధికారులు వివరించారు. కొన్ని గంటల్లో కీలకమైన హైదరాబాద్, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ సమయంలో కరెంట్ కట్ చేయడం ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తోంది. రేపు మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
కీలకమైన ఐపీఎల్ మ్యాచ్ కు ముందు ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కోటి 64లక్షల రూపాయల బకాయిలు ఉండటం వల్లే విద్యుత్ సరఫరా నిలిపేశామని విద్యుత్ అధికారులు చెబుతుంటే.. హెచ్ సీఏ ప్రతినిధులు మరోలా చెబుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు మ్యాచ్ పాసులు అడిగారని, ఇవ్వకపోవడంతో కరెంట్ కట్ చేశారని HCA ప్రతినిధులు ఆరోపించారు.
Also Read : క్రికెట్‌లో పెను విషాదం.. ఆల్ రౌండర్ అరువా మృతి.. శోకసంద్రంలో ఆసియా-పసిఫిక్ క్రికెట్