ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ కోసం రేవంత్ సర్కారు చేసిన ప్రయత్నాల ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం: శ్రీధర్‌ బాబు

"వేగం కీలకం. సంసిద్ధత అత్యంత ముఖ్యం. పరిశ్రమల పరంగా, సాంకేతిక పరంగా మనం సిద్ధంగా ఉండాలి" అని అన్నారు.

ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ కోసం రేవంత్ సర్కారు చేసిన ప్రయత్నాల ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం: శ్రీధర్‌ బాబు

Sridhar Babu

Updated On : January 25, 2026 / 5:30 PM IST
  • ఒక్క సైబర్ దాడి నగరాన్ని స్తంభింపజేస్తుంది..
  • సప్లై చైన్‌లో అంతరాయం దేశాన్ని బలహీనపరుస్తుంది
  • ఉపగ్రహ వ్యవస్థలు విఫలమైతే దేశం చీకటైపోతుంది
  • 10TV Beyond Borders ప్రోగ్రాంలో శ్రీధర్‌ బాబు 

10TV Beyond Borders: 10TV బియాండ్ బోర్డర్స్ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ, అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10టీవీని అభినందించారు.

“10 టీవీ తరఫున మీరు బియాండ్ బోర్డర్స్ అనే కాఫీ టేబుల్ బుక్‌ను ప్రచారం చేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు 10టీవీ ఛానల్ ఏంటి? ప్రత్యేకించి డిఫెన్స్‌కు సంబంధించిన అంశంపై ఈ తరహా కార్యక్రమం చేయడం ఏంటి? అని అడిగాను. ప్రతి పౌరుడికి బాధ్యత ఉన్నట్టే మా ఛానల్‌కు కూడా ఒక బాధ్యత ఉందని 10టీవీ ప్రతినిధులు చెప్పారు.

ఆ బాధ్యతలో భాగంగానే దేశానికి సంబంధించిన పరిణామాలు, సరిహద్దుల్లో జరుగుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. అలా చెప్పినందుకు 10 టీవీకి చెందిన మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

Also Read: క్షిపణి వ్యవస్థలను ఎగుమతి చేసే స్థాయికి వచ్చేశాం.. ఇప్పుడు మా లక్ష్యం ఇదే..: డీఆర్‌డీఎల్ డైరెక్టర్‌ అంకత్తి రాజు

దేశ భద్రత అనేది కేవలం యూనిఫాం ధరించినవారికో, ఒక సంస్థకో పరిమితం కాదు. భద్రత ప్రతి పౌరుడి బాధ్యత. అందరి బాధ్యతతో ముడిపడి ఉన్న అంశం. ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో 10 టీవీ చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.

ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. శాంతి, ఘర్షణల మధ్య చాలా సన్నని గీత మాత్రమే ఉంటుంది. ఇటీవలి కాలంలో కొన్ని విమానాశ్రయాలకు సంబంధించిన ఘటనలు చూశాం. ఒక్క తూటా కూడా పేల్చకుండానే ఒక నగరాన్ని ఒక సైబర్ దాడి స్తంభింపజేయగలదు. సప్లై చైన్‌లో అంతరాయం దేశాన్ని బలహీనపరుస్తుంది. ఉపగ్రహ వ్యవస్థలు విఫలమైతే దేశం చీకటైపోతుంది.

టెక్నాలజీ మంత్రిగా, డిఫెన్స్‌కు సంబంధించిన పరిశ్రమల బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిగా ఈ అంశంపై మాట్లాడుతున్నప్పుడు టెక్నాలజీ పాత్రను, పరిశ్రమల లోతును, ప్రతిభ అవసరాన్ని మర్చిపోలేం. వేగం కీలకం. సంసిద్ధత అత్యంత ముఖ్యం. పరిశ్రమల పరంగా, సాంకేతిక పరంగా మనం సిద్ధంగా ఉండాలి.

ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సైనికుడిగా, ఈ రోజు పాలసీ నిర్ణయాలు తీసుకునే మంత్రిగా తన అనుభవాలను సంక్షిప్తంగా వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ నిర్మాణానికి చేసిన ప్రయత్నాల ఫలితాలను మనం ఈ రోజు చూస్తున్నాం” అని అన్నారు.