UPSC Civil Services Result: సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో సత్తాచాటిన పేదింటి బిడ్డలు
దేశంలోనే అత్యున్నతంగా భావించే సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో టాప్ 100 ర్యాంకుల్లో పది మంది తెలుగువాళ్లు ఉన్నారు. అంతేకాక, సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటిన వారిలో పేదింటి బిడ్డలు ఉన్నారు.

Dongri Revaiah and Koyada Pranay Kumar
UPSC Civil Services Result: దేశంలోనే అత్యున్నతంగా భావించే సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగోళ్లు సత్తాచాటారు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ -2022 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 933 మంది సర్వీస్‌కు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీల నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. మొత్తం 933 మందిలో తెలుగు రాష్ట్రాల నుంచి 46 మందికిపైగా అర్హత సాధించారు. టాప్ 100 ర్యాంకుల్లో పది మంది తెలుగువాళ్లు ఉండటం గమనార్హం. అంతేకాక, సివిల్స్ ఫలితాల్లో సత్తాచాటిన తెలుగోళ్లలో పేదింటి బిడ్డలు ఉన్నారు.
యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబర్చారు. వీరిలో పేద కుటుంబాలకు చెందిన వారు కూడా ఉన్నారు. మధ్యాహ్న భోజన కార్మికురాలి కుమారుడు డోంగ్రి రేవయ్య ఆలిండియా స్థాయిలో 410వ ర్యాంకు సాధించాడు. తద్వారా చదువుకు పేదరికం అడ్డురాదని నిరూపించాడు. రేవయ్యది కుమురంభీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడ గ్రామం. రేవయ్య తల్లి డోంగ్రి విస్తారుబాయి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులిగా పనిచేస్తోంది. ఐఐటీ మద్రాస్ లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రేవయ్య కొన్నాళ్లు ఐఎన్ జీసీలో ఉద్యోగం చేశాడు. సవిల్స్ లక్ష్యంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. 2021లో జరిగిన యూపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా కేవలం రెండు మార్కులతో ర్యాంకు కోల్పోయాడు. ఈసారి మరింత పట్టుదలతో చదివి రేవయ్య అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.
IAS IPS Salary : ఐఏఎస్, ఐపీఎస్‌లకు శిక్షణ ఎక్కడ ఇస్తారు? ఎన్ని రోజులు ఇస్తారు? జీతం ఎంత ఇస్తారు?
జనగాం జిల్లాకు చెందిన కొయ్యాడా ప్రణయ్ కుమార్ తొలిసారి సివిల్స్ పరీక్షకు హాజరై 885వ ర్యాంకు సాధించాడు. ప్రణయ్ కుమార్ తండ్రి కొయ్యాడా ప్రభాకర్. అతను దినసరి కూలీ. ప్రణయ్ ఎస్సీ స్టడీ సర్కిల్ లో చదివి ఈ ఘనత సాధించాడు. ప్రణయ్ తండ్రి దినసరి కూలీకాగా, అతని తల్లి గృహిణి. ప్రణయ్ మేడ్చల్ జిల్లా నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదవగా.. గజ్వేల్ ప్రభుత్వ సోషల్ రెసిడెన్షియల్ లో పాలిటెక్నిక్, జేఎన్ టీయూలో బీటెక్ చేశాడు. దేశంలోనే అత్యున్నతంగా భావించే సివిల్స్ పరీక్ష ఫలితాల్లో ప్రణయ్ ర్యాంకు సాధించడం పట్ల అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.