తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ
ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

KTR
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఆయన ఆరోపణలపై ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉట్నూర్ పోలీసులు నమోదు చేసిన కేసును కేటీఆర్ హైకోర్టులో సవాలు చేశారు. కేటీఆర్‌కు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును ఆత్రం సుగుణ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆత్రం సుగుణ పిటిషన్ పై జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్ పై సమాధానం చెప్పాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది.
కాగా, గత ఏడాది అక్టోబరులో కేటీఆర్‌పై ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. మూసీ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని అప్పట్లో కేటీఆర్ ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు.