సూర్యాపేట బంగారం చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ .. అవి వదిలి వెళ్లిన దొంగలు.. ఆ ఐదుగురిపై అనుమానం..
తొలుత 18కిలోల బంగారం అపహరణకు గురైందని ప్రచారం జరిగింది.. కానీ, పూర్తిస్థాయి పరిశీలన అనంతరం 8.50 కిలోల బంగారం, నాలుగు బంగారు బిస్కెట్లు, 17 లక్షల నగదు అపహరణ కు గురైనట్లు..

Suryapet Gold Theft Case
Suryapet Gold Theft Case: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బంగారం దుకాణంలో చోరీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, తొలుత 18కిలోల బంగారం అపహరణకు గురైందని ప్రచారం జరిగింది.. కానీ, పూర్తిస్థాయి పరిశీలన అనంతరం 8.50 కిలోల బంగారం, నాలుగు బంగారు బిస్కెట్లు, 17 లక్షల నగదు అపహరణకు గురైనట్లు పోలీసుల నిర్దారించారు. లాకర్ గదిలోనే అరున్నర కిలోల బంగారు ఆభరణాలను దొంగలు వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
బంగారం దొంగలను గుర్తించేందుకు ఐదు బృందాల ద్వారా గాలింపు చేపడుతున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. దుకాణంలో పక్కా ప్రణాళికతోనే దొంగలు చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వెనుక భాగంలోని రెండు బాత్ రూంల మధ్య నాలుగు ఇంచుల గోడను సులభంగా కూలగొట్టారు. సమీపంలో నివాసాలు లేకపోవటంతో ఎవరికీ వినిపించే అవకాశం లేదు. సముదాయంలో మిగిలిన అన్ని దుకాణాలకు వెనుక నుంచి గడిపెట్టారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.
బంగారం దొంగిలించిన దొంగల ఇంటిని పోలీసులు గుర్తించారు. దొంగలు జనం మధ్యలో ఉంటూ రేక్కీ నిర్వహించనట్లు గుర్తించారు. ఈ భారీ దోపిడీకి పాల్పడింది యూపీకి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారం దుకాణంకు 100 మీటర్ల దూరంలోనే ఉన్న ఒక పాత ఇంట్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు వ్యక్తులు రెండు నెలలుగా నివాసం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ ఇంటి చుట్టుపక్కల ఇంట్లో నివాసముంటున్న వారిని విచారించారు.
ఆ ఐదుగురు వ్యక్తులు నివాసం ఉన్న ఇంటిని పోలీసులు తనిఖీ చేయగా.. ఆ ఇంట్లో చిన్న, చిన్న బంగారం పూసలు దొరికినట్లు సమాచారం. ఆ ఇంటి లోపల కేవలం ఒక చాప మాత్రమే ఉండటం గమనార్హం. ఐదుగురు నివాసం ఉన్న పాత ఇంటిలో తలుపులు, గోడలపై క్లూస్ టీమ్స్, పోరెన్సిక్ టీం తనిఖీ చేసి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.