BRSలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోసం కేటీఆర్, హరీశ్ రావు పోటీ?
కేటీఆర్, హరీశ్ రావు..వీళ్లిద్దరిలో ఎవరో ఒకరికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తే..మరొకరి నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో అని కేసీఆర్ తెగ ఆలోచిస్తున్నారంట

Harish Rao, KTR
ఆ ఇద్దరిలో ఆ పోస్ట్ దక్కేవరికి? ఆ ఇద్దరి మధ్య పోటీ లేకపోయినా కీలక పదవి ఎవరిని వరిస్తుంది? ఇప్పుడిదే ప్రతిపక్ష BRS వర్గాల్లో ఆసక్తిని రేపుతోందట. అవును..అసెంబ్లీలో BRS LP డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఎవరికి కట్టబెడతారన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది. కేసీఆర్ తరువాత పార్టీలో నెంబర్ టూగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావు..వీరిద్దరిలో ఎవరిని BRS LP ఉప నేతగా నియమిస్తారన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
గులాబీ పార్టీలో పదవుల కేటాయిపుపై పార్టీ అధినేత కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారట. BRS LP, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు పూర్తై ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు శాసనసభలో BRS LP డిప్యూటీ లీడర్ ను మాత్రం నియమించలేదు. శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎంపికను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్.
దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ఆయా అంశాలను బట్టి సాధ్యమైనంత వరకు కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్బంగా మరోసారి BRS LP డిప్యూటీ లీడర్ పదవిపై పార్టీ ఎమ్మెల్యేల్లో చర్చ మొదలైందని సమాచారం. ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న పార్టీ రజతోత్సవ సభలోనైనా ఈ క్లారిటీ వస్తుందా అని గులాబీ నేతలు ఎదురుచూస్తున్నారట.
Also Read: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు
శాసనసభలో ప్రతిపక్షానికి ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ రీడర్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవులు ఉంటాయి. ఇప్పటికే అసెంబ్లీలో BRS LP నాయకుడిగా కేసీఆర్ ఉన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసవెళ్లిన అరికెపూడి గాంధీకి ఇచ్చారు. దీంతో మిగిలిన BRS LP డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఎవరికిస్తారన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది.
ప్రతిపక్షనేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రెగ్యులర్ గా రావడంలేదు కాబట్టి.. ఆయన లేనప్పుడు ఆ బాధ్యతలను డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తీసుకుంటారు. అప్పుడు బీఆర్ఎస్ తరపున అసెంబ్లీలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం లభిస్తుంది. అసెంబ్లీలో రెండు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోస్టులను నియమించుకునే అవకాశం ఉండటంతో పార్టీ తరపున ఇద్దరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తామని గత బడ్జెట్ సమావేశాల్లోనే కేసీఆర్ చెప్పారు. దీంతో ఆ రెండు పదవులు ఎవరికి దక్కుతాయన్న చర్చ గులాబీ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
విమర్శలు సైతం వెల్లువెత్తే అవకాశం
BRS పార్టీలో అధినేత కేసీఆర్ తరువాత నెంబర్ టుగా ఉన్న ఇద్దరు నేతలు కేటీఆర్, హరీశ్ రావులలో ఒకరికి అసెంబ్లీలో BRS డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి దక్కవచ్చన్న టాక్ పార్టీ వర్గాల్లో ఒకవైపు విన్పిస్తుంటే మరోవైపు రెండు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులను వీళ్లిద్దరికి ఇవ్వొచ్చన్న చర్చ సైతం పార్టీలో జరుగుతోందట. ఐతే ఇలా చేస్తే అసెంబ్లీలో కీలక పదవులన్నీ కేసీఆర్ తన కుటుంబానికే కేటాయించుకున్నారన్న విమర్శలు సైతం వెల్లువెత్తే అవకాశం ఉందని..కే సీఆర్ సహా పార్టీ ఉన్నతవర్గాలు అంచనా వేస్తున్నాయట.
పెత్తనం మొత్తం ఒక్క కుటుంబం చేతిలోనే ఉన్నాయనే ఆరోపణలకు చెక్ పెట్టాలంటే కేటీఆర్, హరీశ్ రావు…వీళ్లిద్దరిలో ఎవరో ఒక్కరికి మాత్రమే శాసన సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇచ్చి, మరో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిని సీనియర్ ఎమ్మెల్యేకు కట్టబెట్టే ఛాన్స్ ఉందన్న చర్చ సైతం పార్టీవర్గాల్లో విన్పిస్తోందట. మరో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోసం సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారట.
అయితే కేటీఆర్, హరీశ్ రావు..ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో..ఎవరికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిని కట్టబెట్టాలన్న దానిపై గులాబీ బాస్ కేసీఆర్..మల్లగుల్లాలు పడుతున్నారంట. ఎన్నికలు పూర్తై ఏడాదిన్నర గడుస్తున్నప్పటికీ గులాబీ బాస్ కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారట.
కేటీఆర్, హరీశ్ రావు..వీళ్లిద్దరిలో ఎవరో ఒకరికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇస్తే..మరొకరి నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో అని కేసీఆర్ తెగ ఆలోచిస్తున్నారంట. అయితే ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలోనైనా దీనిపై ఓ క్లారిటీ వస్తుందో లేదో అనేది చూడాలి.