Telangana Assembly Election 2023 Result : తెలంగాణలో ఓట్ల లెక్కింపు ఇలా.. ఆరు నియోజకవర్గాల్లో లెక్కింపునకు అధిక సమయం.. ఎందుకంటే?
తొలుత పోస్టల్ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అవి పూర్తయిన తరువాత అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను తెరిచి కంట్రోల్ యూనిట్లను టేబుల్ కు ఒకటి చొప్పున బయటకు తీసుకొస్తారు.

Telangana Election 2023
Telangana Assembly Election 2023 Result : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల బరిలో మొత్తం 2,290 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 221 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలో 2.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతనెల 30న పోలింగ్ జరగ్గా.. రాష్ట్ర వ్యాప్తంగా 71.34శాతం పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఆరు నియోజకవర్గాల్లో అధిక సమయం..
రాష్ట్రంలోని ఆరు నియోజకవర్గాల్లో ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అక్కడి ఫలితాల వెల్లడికి అధిక సమయం పడుతుందని అధికారులు తెలిపారు. వీటిలో శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, మేడ్చల్ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఒక్కోచోట 500 నుంచి 600 వరకు పోలింగ్ కేంద్రాలు ఉండటమే దీనికి కారణం. ఈ ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేశారు.
ఓట్ల లెక్కింపు ఇలా..
– తొలుత పోస్టల్ ఓట్లను 25 బ్యాలెట్ల చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు. అవి పూర్తయిన తరువాత అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను తెరిచి కంట్రోల్ యూనిట్లను టేబుల్ కు ఒకటి చొప్పున బయటకు తీసుకొస్తారు.
– కంట్రోల్ యానిట్ లోని టోటల్ బటన్ ను నొక్కగానే ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుస్తుంది. పోలైన ఓట్ల వివరాలను 17-సి పేరిట నమోదు చేసిన రికార్డుతో.. కంట్రోల్ యూనిట్ లో వచ్చిన మొత్తం ఓట్లతో సరిపోయాయా? లేదా? అని పరిశీలిస్తారు.
– ఆ తరువాత రిజల్ట్స్ మీటను నొక్కగానే ఒక్కో అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో కనిపిస్తాయి. ఆ వివరాలను ఇటు అధికారులు, అటు పోలింగ్ ఏజెంట్లు నమోదు చేసుకుంటారు.
– ఏజెంట్ల నుంచి ఆమోదం లభించిన తరువాత వారి సంతకాలు తీసుకుంటారు. అనంతరం మరో కంట్రోల్ యూనిట్ ను లెక్కిస్తారు. ఇలా ఒక్కో విడతకు 14 కంట్రోలు యూనిట్లలోని వివరాలు లెక్కించేలా 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 14 ఈవీఎంల లెక్కింపు పూర్తయితే ఒక రౌండ్ ముగిసినట్లు.
– అభ్యర్థులు, ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో 28 ఈవీఎంల లెక్కింపును ఒక రౌండుగా పరిగణిస్తారు.
– నియోజకవర్గానికి సంబంధించిన అన్ని రౌండ్ల లెక్కింపు పూర్తయ్యాక.. ఆ నియోజకవర్గం లెక్కింపు పరిశీలకుడు, ఏజెంట్ల సమక్షంలో ర్యాండమ్ గా అయిదు వీవీ ప్యాట్స్ ను ఎంపిక చేస్తారు. వాటి లోని ట్రేలను తెరిచి ఓటరు స్లిప్పులను లెక్కిస్తారు. ఇలా అయిదు వీవీ ప్యాట్ లలో లెక్కించిన వివరాలకు.. అంతకుముందు 17-సీలో నమోదు చేసిన ఓట్ల సంఖ్యకు సరిపోలితే అధికారులు, ఏజెంట్ల ఆమోదంతో ఫలితాన్ని ప్రకటిస్తారు.