Chamakura Malla Reddy : ముసలవ్వను ఒడిలో కూర్చోబెట్టుకొని మల్లారెడ్డి వినూత్న ప్రచారం.. వీడియో వైరల్
మేడ్చల్ మున్సిపాలిటీ 18వ వార్డులో శుక్రవారం మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ..

Chamakura Malla Reddy
Telangana Assembly Elections 2023 : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విడతల వారిగా అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు ప్రచార పర్వాన్ని మొదలు పెట్టేశారు. పట్టణం, పల్లెల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారం అంటేనే కొందరు నాయకులు ఓటర్లను ఆకర్షించేలా వినూత్న రీతిలో ప్రచారంలో పాల్గొంటారు. ఇలాంటి వారిలో బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి ముందు వరుసలో ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.
మంత్రి మల్లారెడ్డి ఉన్నచోట్ల మామూలుగానే సందడి వాతావరణం ఉంటుంది. ఇక ఎన్నికల ప్రచారంలో అయితే మరింత సందడి వాతావరణం ఉంటుంది. ఈ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి బరిలో నిలిచారు. బీఆర్ఎస్ అధినేత టికెట్ కేటాయించినప్పటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో ఆయన చేసే వింత పనులు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మామూలుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు వినూత్నంగా దోసెలు వేయడం, ఇస్త్రీ చేయడం, ఇతర పనులు చేస్తూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంటారు. కానీ, మల్లారెడ్డి స్టైలే వేరుకదా.. ఏకంగా ఓ ముసలవ్వను ఒడిలో కూర్చోబెట్టుకొని అందరిని ఆశ్చర్యపర్చారు.
మేడ్చల్ మున్సిపాలిటీ 18వ వార్డులో శుక్రవారం మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా స్థానిక మహిళలతో కూర్చన్న మల్లారెడ్డి.. పక్కనే ఉన్న ముసలవ్వను రెండు చేతులతో ఎత్తి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. మల్లారెడ్డి ప్రవర్తనతో ఆ ముసలవ్వ ఒక్కసారిగా కంగారుపడిపోయింది. ఆ ముసలవ్వతో మల్లారెడ్డి జైజైలు కూడా కొట్టించుకున్నడు. మల్లారెడ్డి ప్రవర్తనతో అక్కడే ఉన్న మహిళలుసైతం ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల తాను గతంలో పాలు అమ్మిన బండిపై చక్కర్లు కొడుతూ మల్లారెడ్డి సందడి చేసిన విషయం తెలిసిందే.