Telangana Assembly Session : తెలంగాణ అసెంబ్లీ తొలి సమావేశాల్లో కొత్త ఎమ్మెల్యేల సందడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిశాక తొలి సమావేశం శనివారం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుండటంతో అసెంబ్లీ ఆవరణ అంతా సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు మూడో శాసనసభా తొలి సమావేశానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు....

Telangana Assembly Session
Telangana Assembly Session : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిశాక తొలి సమావేశం శనివారం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుండటంతో అసెంబ్లీ ఆవరణ అంతా సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశాలతో అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు మూడో శాసనసభా తొలి సమావేశానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ అసెంబ్లీలోకి తొలిసారి 51 మంది సభ్యులు అడుగుపెట్టనున్నారు. కొత్త వారిలో ముగ్గురు మహిళలున్నారు.
ప్రొటెం స్పీకరుగా అక్బరుద్దీన్ ఒవైసీ
కొత్త సభ్యుల్లో 18 మందికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అతి తక్కువ వయసున్న యశస్వినీ రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కొత్త శాసనసభ్యులు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ధ్రువపత్రాలతో సభ్యులు వచ్చారు. అసెంబ్లీకి ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకరుగా గవర్నర్ తమిళసై శనివారం ప్రమాణస్వీకారం చేయించారు. 11 గంటలకు అసెంబ్లీ తొలి సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్యేలందరూ తమ పార్టీ కండువాలతో అసెంబ్లీకి తరలివచ్చారు.
అసెంబ్లీలో సభ్యుల కోలాహలం
అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేల రాకతో సందడి వాతావరణం నెలకొంది. సమావేశం ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకరు అక్బరుద్దీన్ ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణ నమూనా పత్రాలను తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషల్లో సభ్యులకు అందించారు.సభ్యులు అసెంబ్లీ అధికారులకు వారి, వారి జీవిత భాగస్వామికి చెందిన పాస్ పోర్టు ఫొటోలను అందజేశారు. వారి బయోడేటాలను అధికారులకు ఇచ్చారు.
బీజేపీ శాసనసభా పక్ష నేత ఎవరు ?
ప్రతీ ఎమ్మెల్యేకు అసెంబ్లీ అధికారులు అసెంబ్లీ హ్యాండ్ బుక్, బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు లెటరు, లెటర్ హెడ్స్ అందించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలందరూ ఫొటోలు దిగుతున్నారు. అక్బరుద్దీన్ ముందు తాము ప్రమాణస్వీకారం చేయనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా సీనియర్ ఎమ్మెల్యే అయిన రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి, వెంకటరమణారెడ్డిలలో ఒకరిని నియమించే అవకాశాలున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో మూడో అసెంబ్లీ ప్రారంభం సందర్భంగా శాసనసభ భవనానికి రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దారు.
అసెంబ్లీకి వచ్చిన కుటుంబసభ్యులు
అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు కొత్త రూపు ఇచ్చారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారోత్సవాన్ని చూసేందుకు వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు అసెంబ్లీకి తరలివచ్చారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబరు, స్పీకర్, డిప్యూటీ స్పీకరు, కాంగ్రెస్ శాసనసభా పక్ష, బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ పక్షాల కార్యాలయాలను సిద్ధం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.
ALSO READ : Former Telangana CM KCR : తెలంగాణ ప్రతిపక్ష నేతగా కేసీఆర్?
ఆయన పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ప్రతిపాదించింది. కాంగ్రెస్ నుంచి దళిత నాయకుడు అయిన ప్రసాద్ మొదటిసారిగా 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయన పూర్వ ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అతను 2014 మరియు 2018లో వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసాద్ కుమార్ విజయం సాధించారు.
ALSO READ : Telangana Ministers : తెలంగాణ మంత్రుల శాఖలకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్
స్పీకర్ ఎన్నిక అనంతరం ఆయన అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఎసి) సమావేశం ఈ సెషన్‌లో అసెంబ్లీని ఎన్ని రోజులు నిర్వహించాలో నిర్ణయించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తాలతో పాటు ఇతర అధికారులు అసెంబ్లీ వద్ద భద్రతతోపాటు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిషేధాజ్ఞలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.