డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రామచందర్‌రావు లీగల్ నోటీసులు
భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, రూ.25 లక్షలకు పరువు నష్ట దావా వేస్తామని హెచ్చరించారు.

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు లీగల్ నోటీసులు పంపారు. హెచ్‌సీయూ పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు రామ్‌చందర్ రావే కారణమంటూ భట్టి విక్రమార్క ఆరోపణలు చేశారని, బేషరతుగా మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
భట్టి విక్రమార్క క్షమాపణలు చెప్పకపోతే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, రూ.25 లక్షలకు పరువు నష్ట దావా వేస్తామని హెచ్చరించారు. తన అడ్వకేట్ విజయ కాంత్‌తో రామచందర్‌రావు నోటీసులు పంపారు. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని రామచందర్‌రావు తరుఫు అడ్వకేట్ అటాచ్ చేశారు.
కాగా, ఇటీవల భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారంటూ కామెంట్లు చేశారు. రామచందర్‌రావుకు ఆ పదవి ఇవ్వడంపై బీజేపీ పెద్దలు పునరాలోచన చేయాలని చెప్పారు.
రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై తమ సర్కారు విచారణ జరుపుతోందన్నారు. అంతేగాక, రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని చెప్పారు. 2016లో వర్సీటీ యాజమాన్యం రోహిత్ వేములపై చర్యలు తీసుకునేలా రామచందర్‌రావు ఆందోళన చేశారన్నారు.