Tank Bund Shiva : ట్యాంక్‌బండ్ శివ కుటుంబానికి రేవంత్ సర్కార్ అండ.. కుమారుడికి ఉద్యోగం, భారీగా ఆర్థిక సాయం
Tank Bund Shiva : ట్యాంక్‌బండ్ శివ కుటుంబానికి తెలంగాణ సర్కార్ బాసటగా నిలిచింది. భారీగా ఆర్థిక సాయంతో పాటు.. కుమారుడికి ఉద్యోగం కల్పించింది.
telangana cm revanth reddy support tank bund shiva with rs 5 lakh and home guard job to his son
- ట్యాంక్‌బండ్ శివను ఆదుకున్న సీఎం రేవంత్
- కుటుంబానికి రూ.5 లక్షల సాయం
- శివ కొడుక్కి ఉద్యోగం
Tank Bund Shiva : ట్యాంక్‌బండ్ శివ.. నగర వాసులకు ఇతడి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. క్షణికావేశంలోనో.. లేదంటే కష్టాల బాధను భరించలేక.. ప్రాణాలు తీసుకుందామని.. హుస్సేన్ సాగర్ వద్ద ఆత్మహత్యకు పాల్పడిన వారు ఎందరినో కాపాడి.. వారికి మరో జన్మ ప్రసాదించి ట్యాంక్‌బండ్ శివగా గుర్తింపు తెచ్చుకున్నారు. అతడు చేస్తున్న సేవను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం శివ కుటుంబానికి అండగా నిలిచింది. ఎందరి ప్రాణాలో కాపాడిన శివ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చారు. ఈ క్రమంలో శివ కొడుక్కి ఉద్యోగంతో పాటు.. వారి కుటుంబానికి భారీగా ఆర్థిక సాయం అందించారు.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి.. ట్యాంక్‌బండ్ శివ కుటుంబ సభ్యులను కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాస గృహంలో మంగళవారం శివ కుటుంబ సభ్యులను కలిసిన రేవంత్ రెడ్డి, అతడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అలానే శివ కొడుకు వేణు మాధవ్‌కు హోంగార్డుగా ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. హుస్సేన్ సాగర్‌లో దూకి.. ఆత్మహత్యకు పాల్పడిన ఎందరినో కాపాడి.. వారి కుటుంబాల్లో సంతోషం నింపిన శివ కుటుంబ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. పుట్టెడు కష్టాల్లో ఉన్నప్పటికీ శివ మాత్రం తన సామాజిక సేవను వదిలిపెట్టలేదు.
ఈ క్రమంలో శివ కుటుంబం అనుభవిస్తున్న దీన స్థితి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన సీఎం.. శివకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శివ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు.. అతడి కుమారుడు వేణు మాధవ్‌కు హోంగార్డు ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. వీటితో పాటు.. శివకు డబుల్ బెడ్రూం ఇంటిని మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే తనకు ఉపాధి కోసం ట్యాంక్‌బండ్ దగ్గర ఒక స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించి ఇవ్వాల్సిందిగా సీఎంను అభ్యర్థించాడు శివ. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
