జనగామ మార్కెట్‌లో రైతులను మోసం చేసిన ఘటనపై సీఎం రేవంత్ సీరియ‌స్‌

అన్నదాతలను అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటూ.. దళారులను హెచ్చరించారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.

జనగామ మార్కెట్‌లో రైతులను మోసం చేసిన ఘటనపై సీఎం రేవంత్ సీరియ‌స్‌

Updated On : April 12, 2024 / 10:11 AM IST

cm revanthreddy warning: జనగామ మార్కెట్‌లో రైతులను మోసం చేసిన ఘటనపై సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. అన్నదాతలను అన్యాయం చేస్తే ఊరుకునేది లేదంటూ.. దళారులను హెచ్చరించారు. రైతుల‌ను మోసం చేసిన న‌లుగురు ట్రేడ‌ర్స్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. మార్కెట్ క‌మిటీ కార్యద‌ర్శిని సస్పెండ్ చేశారు. తాలు, తేమ పేరుతో ధాన్యం ధ‌ర‌ను త‌గ్గిస్తే సీరియస్‌ యాక్షన్‌ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.

యాసంగి పంట మ‌ద్ధతు ధర‌ను ప్రక‌టించింది రేవంత్ ప్రభుత్వం. క్వింటాలుగా వ‌రి ధాన్యానికి 2వేల 203 రూపాయ‌ల ధ‌ర‌ను నిర్ణయించింది. అయితే మ‌ద్ధతు ధర ఇవ్వకుండా.. కొంద‌రు ద‌ళారులు రైతుల‌ను నిండా ముంచుతున్నారు. జన‌గామ మార్కెట్ యార్డ్‌లో ఇదే జరిగింది. మార్కెట్‌లోని అధికారులు, కొంద‌రు ట్రేడ‌ర్స్ కుమ్మక్కై ధాన్యం ధ‌ర‌ను త‌గ్గించారు. ధాన్యంలో తేమశాతం, తాలు ఎక్కువ‌గా ఉంద‌ని క్వింటాలు ధాన్యం ధ‌ర‌ను 1550, 1569 రూపాయ‌లుగా నిర్ణయించారు. దీంతో రైతులు ఆందోళ‌న‌కు దిగారు.

జ‌నగామ మార్కెట్ యార్డ్‌లో దళారుల దందాపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం మద్దతు ధర తగ్గించిన న‌లుగురు ట్రేడ‌ర్స్ పై క్రిమిన‌ల్ కేసులతో పాటు దళారుల‌కు స‌హ‌క‌రించిన మార్కెట్ క‌మిటీ కార్యద‌ర్శిని సస్పెండ్ చేయాల‌ని జిల్లా క‌లెక్టర్ ను ఆదేశించారు సీఎం. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ళ విష‌యంలో అధికారులు అప్రమ‌త్తంగా ఉండాల‌ని మ‌ద్ధతు ధ‌ర విష‌యంలో రైతులకు అన్యాయం జ‌ర‌గ‌కుండా చూడాలని సూచించారు.

Also Read: సై అంటే సై.. జహీరాబాద్‌ ఎంపీ సీటులో 3 పార్టీల మధ్య ఉత్కంఠ పోరు

రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే 5వేల 422 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. అయితే కొనుగోలు కేంద్రాల‌తో పాటు మార్కెట్‌లో ఎక్కడైనా ప్రభుత్వం ప్రకటించిన మ‌ద్ధతు ధ‌ర అందకపోతే కఠినంగా వ్యవహరిస్తామని ఆదేశించింది ప్రభుత్వం. రైతుల‌కు మద్దతు ధ‌ర అందే విష‌యంలో తేడా వ‌స్తే బాధ్యుల‌పై క్రిమిన‌ల్ కేసులు పెడ‌తామని హెచ్చరిస్తుంది తెలంగాణ సర్కార్.