మే 07 వరకు లాక్ డౌన్..నిబంధనలు పాటించాల్సిందే – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండడం శుభపరిణామమని..కానీ 2020, మే 07 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండడం శుభపరిణామమని..కానీ 2020, మే 07 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని..అప్పటి వరకు ప్రజలు నిబంధనలు పాటించాల్సిందేనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అత్యవసరం అయితే..తప్ప ప్రజలు బయటకు రావొద్దని..పండుగలు ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. కేసులు తగ్గుతున్న క్రమంలో ఆక్టివ్ కేసులు లేని ప్రాంతంలో కంటైన్ మెంట్ జోన్ల సంఖ్య తగ్గిస్తామన్నారు.
2020, ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం ప్రధాన మంత్రి మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. లాక్ డౌన్ కొనసాగుతున్న తీరు..రోగులకు అందుతున్న చికిత్స తదితర అంశాలపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
కరోనా వైరస్ సోకిన వారి వివరాలు..ఇతరుల వివరాలను సమర్థవంతంగా సేకరించారని వైద్య ఆరోగ్య శాఖను అభినందించారు. పది జిల్లాలు మహబూబాబాద్, సిద్దిపేట, వరంగల్ రూరల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్ ప్రస్తుతం ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదన్నారు. గద్వాల, వికారాబాద్, హైదరాబాద్, సూర్యాపేట లాంటి ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, మిగతా జిల్లాల్లో తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులున్నాయన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ సోకిన వారిలో అత్యధిక శాతం మంది క్వారంటైన్ పీరియడ్ 2020, మే 08వ తేదీ నాటికి ముగియబోతోందని, ప్రస్తుత పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసుల సంఖ్య పెరిగినా..సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యవస్థ ఉందని, టెస్టింగ్ కిట్స్, PPE కిట్లు, SN 95 మాస్కులు, ఇతర మాత్రలు, పరికరాలు, బెడ్స్ అన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు సీఎం కేసీఆర్.