Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళా సంఘాలు, రైతులకు గుడ్‌న్యూస్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు, మహిళా సంఘాలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టింది.

Telangana: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళా సంఘాలు, రైతులకు గుడ్‌న్యూస్

CM Revanth Reddy

Updated On : June 27, 2025 / 8:56 AM IST

Telangana Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. తాజాగా.. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు మేలు జరిగేలా.. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read: Rain Alert: తెలంగాణలో వానలేవానలు.. ఆ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు

రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ఫ్) ఆధ్వర్యంలో మినీ గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఒక్కో గోదాము నిర్మాణానికి రూ. 15లక్షలు కేటాయించింది. ఈ గోదాములను నిర్మించి మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది.

రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర రానప్పుడు దళారులకు అమ్ముకొని నష్టపోకుండా ధాన్యం నిల్వ చేసుకునేలా మినీ గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మినీ గోదాముల నిర్మాణానికి ఇప్పటికే స్థలాలు గుర్తించిన మండలాల్లో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 184 మినీ గోదాములను నిర్మిస్తుండగా.. అందులో 100 గోదాముల నిర్వహణ బాధ్యతలను మండల సమాఖ్యలకు, 84 గోదాముల బాధ్యతలను ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

కొత్తగా నిర్మాణంచేసే మినీ గోదాములను రాష్ట్రంలోని 31 జిల్లాల్లో నిర్మాణంకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అత్యధికంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ మినీ గోదాముల నిర్మాణం జరగనుంది. మిగిలిన ప్రాంతాల్లోనూ స్థల సేకరణపై జిల్లా కలెక్టర్లు కూడా ప్రత్యేక దృష్టిసారించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో గోదాముల నిర్మాణాన్ని ప్రారంభించాలని సూచించింది. అయితే, ఒక్కో గోదాములో ఎన్ని క్వింటాళ్ల ధాన్యం స్టోరేజీ చేయాలో నాబ్ కిసాన్ సంస్థ అంచనాలను రూపొందిస్తుంది.

రైతులకు దళారుల బెడద నుంచి విముక్తి కల్పించడంతోపాటు.. మద్దతు ధరతో ధాన్యం విక్రయించుకునేలా మినీ గోదాములను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది. రైతులు తమ ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకోవడంతోపాటు ధరలు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. ఈ గోదాముల నిర్మాణం, నిర్వహణను సెర్ప్ పర్యవేక్షించనుంది. దీనిపై మహిళా సంఘాలకు, సమాఖ్యలకు శిక్షణ అందించనున్నారు.