Rain Alert: తెలంగాణలో వానలేవానలు.. ఆ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులపాటు మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Heavy rain
Rain Alert: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ యాక్టివ్ అవుతున్నాయి. మూడు వారాల నుంచి స్తబ్దుగా ఉన్న రుతుపవనాల్లో మళ్లీ కదలిక రావడంతో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. దీనికితోడు ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు నుంచి నాలుగు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులపాటు మెరుపులు, ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఇవాళ (శుక్రవారం) అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మూడు రోజులపాటు ఆయా జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
జూరాలకు పోటెత్తుతున్న వరద నీరు..
కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద క్రమంగా పెరుగుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 91,230 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 70,420 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌కు 66,694 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 68,498 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ఇటు జూరాల ప్రాజెక్టుకు దాదాపు లక్ష క్యూసెక్కుల దాకా వరద వస్తుంది. 96,172 క్యూసెక్కులు కిందకు రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు 88,272 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోస్ వస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలకుగాను 111.41 టీఎంసీలకు చేరింది.