Telangana Govt: ఒక్కరోజే రూ.100 కోట్లు రాబడి..! ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంపు..?
లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) రుసుములో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు ఈ నెల 31తో ముగియనుంది.

CM Revanth Reddy
Telangana Govt: లే అవుట్ క్రమబద్దీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) రుసుములో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు ఈనెల 31వ తేదీతో ముగియనుంది. అయితే, తొలుత నత్తనడకన సాగిన ఈ ప్రక్రియ.. ప్రస్తుతం ఊపందుకుంది. ముగింపు గడువు తేదీ దగ్గరపడుతుండటంతో దరఖాస్తుదారులు క్యూ కడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,074 కోట్ల ఆదాయం సమకూరింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 100 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారవర్గాల సమాచారం.
మార్చి 31వ తేదీలోగా ఎల్ఆర్ఎస్ కోసం చెల్లించే ఫీజులో 25శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎల్ఆర్ఎస్ ద్వారా పెద్దె ఎత్తున ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశించింది. కానీ, రూ. 1,074 కోట్ల ఆదాయం మాత్రమే రావడంతో ఈ గడువును మరోసారి పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఏప్రిల్ నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ రాయితీ గడువును పెంచాలని పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తుదారులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం గడువు పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ నెలాఖరు వరకు గడువును పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ ఆఖరు వరకు రాయితీ పొడిగిస్తే మరింత మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నందున ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నారు.