Telangana Govt : ఏఐతో ప్రశ్నాపత్రాల మూల్యాంకనం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి..

Telangana government : పరీక్షల్లో విద్యార్థులు రాసే సమాధాన పత్రాలను కృత్రిమ మేధ (ఏఐ)తో దిద్దించే ప్రయోగానికి తెలంగాణ ప్రభుత్వం స్వీకారం ..

Telangana Govt : ఏఐతో ప్రశ్నాపత్రాల మూల్యాంకనం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది నుంచి..

Telangana government

Updated On : November 21, 2025 / 9:38 AM IST

Telangana Govt : విద్యార్థులు రాసిన పరీక్ష పత్రాలను ఉపాధ్యాయులు, లెక్చరర్లు మూల్యాంకనం చేస్తుంటారు. అయితే, ఇకనుంచి పరీక్షల్లో విద్యార్థులు రాసే సమాధాన పత్రాలను కృత్రిమ మేధ (ఏఐ)తో దిద్దించే ప్రయోగానికి తెలంగాణ ప్రభుత్వం స్వీకారం చుట్టబోతోంది. టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో టెక్నాలజీని వాడుకుంటూ ఎగ్జామ్స్ వాల్యుయేషన్ ప్రక్రియను స్పీడప్ చేసేందుకు సర్కార్ ప్లాన్ రెడీ చేసింది.

రాష్ట్రంలో మొత్తం 115 పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో దాదాపు 67వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికే పాలిటెక్నికల్ పరీక్షల్లో పలు సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ సిస్టమ్ అమలు చేస్తుండగా.. తాజాగా ఏఐతో ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద కొన్ని సబ్జెక్టుల్లో అమలు చేసి.. దశలవారీగా అన్ని సబ్జెక్టులకు అమలు చేయాలని టెక్నికల్ ఎడ్యుకేషన్ భావిస్తోంది.

తొలుత రెండు సబ్జెక్టుల్లో ఏఐతో మూల్యాంకనం ప్రక్రియను అమలు చేయాలని స్టేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటెట్) అధికారులు నిర్ణయించారు. వచ్చే అకాడమిక్ ఇయర్ లో ప్రయోగాత్మకంగా ఏఐ వాల్యుయేషన్ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఏఐ ద్వారా చేపట్టే వాల్యుయేషన్ ప్రక్రియను మళ్లీ మాన్యువల్ గానూ లెక్చరర్లతో దిద్దించనున్నారు.

ప్రస్తుతం ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ ప్రక్రియ లెక్చరర్లతో కొనసాగుతోంది. కొన్నిసార్లు అనుకున్న సమయానికి ఆన్సర్ షీట్లను దిద్దడం ఇబ్బందికరంగా మారుతోంది. ఈ క్రమంలోనే అధికారులు ఆన్ లైన్ వాల్యుయేషన్ ఆలోచన చేశారు. ఇదిలాఉంటే.. విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. దీంతో కొన్ని చేతిరాతలను ఏఐ గుర్తుపట్టడంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎలాంటి తప్పులు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు.