రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు ఎగిరిగంతేసే శుభవార్త.. వాటితో సంబంధం లేదని చెప్పిన సర్కార్..
రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు ..

Rajiv Yuva Vikasam
Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లోని నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని రేవంత్ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా సొంత బిజినెస్ పెట్టాలనుకునే యువతకు ఆర్థిక సాయం చేయనుంది. ఈ పథకంకు అర్హత పొందిన వారు రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు సబ్సిడీతో కూడి బ్యాంకు రుణాలు పొందుతారు. అంతేకాదు.. అర్హత పొందిన వారికి వారు కోరుకున్న బిజినెస్ లలో శిక్షణ కూడా ఇస్తారు. ఈ పథకం కింద ఇప్పటికే ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. 16,25,441 మంది దరఖాస్తులు చేసుకున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం కింద వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. తద్వారా అర్హత కలిగిన వారిని ఎంపిక చేస్తున్నారు. ఈ ప్రక్రియ మండల స్థాయిలో దాదాపు 90శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే, మొదటి విడతలో ఈ పథకం కింద అర్హులైన 5లక్షల మంది దరఖాస్తుదారులకు ప్రయోజనం కలగనుంది. ఇదంతాబాగానే ఉన్నా.. ఈ పథకంలో అర్హత పొందాలంటే ప్రభుత్వం కొత్త నిబంధన తెచ్చినట్లు గతకొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది.
రాజీవ్ యువ వికాసం పథకంకు దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హత పొందినప్పటికీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే వారి దరఖాస్తులను బ్యాంకులు తిరస్కరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే.. గతంలో గృహ, వ్యవసాయ, వాహన లేదా పర్సనల్ లోన్స్ తీసుకొని తిరిగి చెల్లించని వారి దరఖాస్తులను కూడా బ్యాంకర్లు రిజక్ట్ చేస్తారని సమాచారం. తాజాగా.. ఈ పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ సిబిల్ స్కోర్ పై క్లారిటీ ఇచ్చారు.
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్ తో సంబంధం లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్2 నుంచి అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకం లబ్ధిదారుల ఎంపికలో సిబిల్ స్కోర్ చూస్తారని కొన్ని సామాజిక మాధ్యమాల ద్వారా దుష్ప్రచారం జరుగుతోందని, ఈ ప్రచారాలను నిరుద్యోగులు నమ్మొద్దని భట్టి విక్రమార్క సూచించారు. లబ్ధిదారుల ఎంపికకు సిబిల్ స్కోర్, ట్రాక్ రికార్డు, రికవరీ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకోరని స్పష్టం చేశారు. గతంలో ఎస్సీ, బీసీ, ఐటీడీఏ తదితర సంస్థల రుణాలు పొందిన వారు ఉన్నారని, రాజీవ్ యువ వికాసంలో కొత్త వారికి అవకాశం లభించాల్సి ఉందని భట్టి విక్రమార్క వెల్లడించారు.