Telangana Govt: టెన్త్ పాస్ అయిన విద్యార్ధినిలకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
తెలంగాణలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పేద విద్యార్థినిలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో కొత్తగా మరో ..

students
Kasturba Gandhi Balika Vidyalaya: తెలంగాణలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పేద విద్యార్థినిలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో కొత్తగా మరో 120 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఇంటర్ విద్యను ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 495 కేజీబీవీలు ఉండగా.. వాటిల్లో 283 కేజీబీవీల్లో ఆరు నుంచి ఇంటర్ వరకు విద్య అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో 26వేల మంది బాలికలు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యాలయాలు పూర్తి రెసిడెన్షియల్ విధానంలో పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణలో నడుస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా 120 కేజీబీవీల్లో ఇంటర్ వరకు విద్య అందించేలా ఉన్నతీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం నుంచే ఆ ప్రక్రియను చేపట్టనుంది. 120 కేజీవీబీలను ఇంటర్ విద్యకు అప్ గ్రేడ్ చేయడం ద్వారా మరో 9,600 సీట్లు ఇంటర్ చదివే బాలికలకు అందుబాటులోకి రానున్నాయి.
ఇంటర్ బోధిస్తున్న కేజీబీవీల్లో ఇప్పటి వరకు రెండు చొప్పున గ్రూపులను మాత్రమే ప్రవేశపెట్టారు. ఒక్కో గ్రూపులో 40 సీట్లు చొప్పున ఫస్టియర్ లో 80 సీట్లుంటాయి. అంటే 283 కేజీవీబీల్లో 22,640 సీట్లు ఉన్నాయి. కొత్తగా ఈ సంవత్సరం 120 కేజీబీవీలను ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేస్తుండటంతో మరో 9600 సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. వీటికి ఇంటర్ బోర్డు నుంచి కళాశాల కోడ్ సైతం వచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. త్వరలో అనుబంధ గుర్తింపు కోసం బోర్డుకు అఫిలియేషన్ ఫీజు చెల్లించనున్నారు.