Pending Challans : వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Telangana Govt Extends Traffic Challan Concessions to February 15th
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను రాయితీతో చెల్లించే గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 15 వరకు గడువును పెంచింది. ఇప్పటికే రెండు సార్లు రాయితీతో చెల్లించే గడువును ప్రభుత్వం పొడిగించింది. ద్విచక్ర వాహనాలు, ఆటోల చలాన్లపై 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60శాతం రాయితీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తొలుత డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు ఆతరువాత జనవరి 31 వరకు తాజాగా మరో 15 రోజులు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు భారీగా వాహనదారులు ముందుకువచ్చారు.
హోంగార్డును వినియోగించుకోండి
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కన్సల్టెన్సీ లకు బాధ్యతలను అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సచివాలయంలో సమీక్షించిన సీఎం.. గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
ఆ ఒకే ఒక్కడు ఎవరు? బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు వెళ్లేది ఎవరు?
ట్రాఫిక్ సమస్యను పోలీసులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు.
మూడు నెలల్లోగా ఈ ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలన్నారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోంగార్డులను వెంటనే ట్రాఫిక్ సెక్షన్‌కు తిరిగి రప్పించాలన్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను సిటీ ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలన్నారు.