School Holidays : భారీ వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..

 School Holidays : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు విద్యాశాఖ అధికారులు

School Holidays : భారీ వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..

School Holidays

Updated On : August 29, 2025 / 8:07 AM IST

School Holidays : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో తీరాన్ని దాటిన తీవ్ర అల్పపీడనం మరింత ముందుకు కదిలింది. ప్రస్తుతం మధ్య చత్తీస్‌గఢ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుంది. మరోవైపు.. తూర్పు ఆగ్నేయ దిశలో మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతుంది. ఈ క్రమంలో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఈరోజు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. (School Holidays )

Also Read: Telangana Rains : తెలంగాణలో కుండపోత వానలు.. నేడు ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్.. ప్రాజెక్టులకు వరద హెచ్చరికలు

బుధ, గురువారాల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా సగటున 5.08 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ తదితర జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి.

భారీ వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో గురువారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కామారెడ్డి జిల్లాలో శుక్ర, శనివారం కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవో రాజు ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు బడులు, కళాశాలలకు సెలవు వర్తింపజేసినట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు.. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజామాబాద్, నిర్మల్, హైదరాబాద్ తదితర జిల్లాల్లోనూ పాఠశాలలకు హాలిడే ఇవ్వాలనే వినతులు వినిపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో బుధ, గురువారాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో గురువారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

అయితే, జిల్లా కేంద్రంతోపాటు 18 మండలాల్లో బుధవారం సాయంత్రం 4గంటల నుంచి గురువారం ఉదయం 11గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. జిల్లా చరిత్రలో అతిభారీ వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం కూడా ఈ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు.. గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్టు ప్రకారం.. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, భద్రాద్రి – కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఇవాళ మధ్యాహ్నం నుండి రాత్రి వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్, కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు గాలి దుమారంతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్ జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇదిలాఉంటే.. వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.