High Court: తుది నిర్ణయం స్పీకర్‌దే.. ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్‌పై తీర్పు వెల్లడించిన హైకోర్టు
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పును వెల్లడించింది

Telangana High court
Telangana High Court : బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పును వెల్లడించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. అంతకుముందు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవటంలో ఎలాంటి కాలపరిమితి లేదని హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పులో పేర్కొంది. అయితే, తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని, అదికూడా 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్ల పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, ఐదేళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తాజాగా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లేనని చెప్పొచ్చు.
Also Read: India vs Canada: భారత్ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా.. ఆ కథనాలు అవాస్తవమని వెల్లడి
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్ సహా పలువురు నేతలు ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, పార్టీ మారిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కెపి వివేకానంద్ లు పిటీషన్లు దాఖలు చేశారు. వీరితోపాటు దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ల పై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. అనర్హత పిటీషన్ల పై విచారణ షెడ్యూల్ ను నాలుగు వారాల్లోగా ఖరారు చేయాలని సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Also Read: Gossip Garage : కేసీఆర్ త్రిముఖ వ్యూహం ఫలించిందా? ఇక వలసలు ఆగినట్లేనా?
అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ పిటీషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే బెంజ్ తుది తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసింది. స్పీకర్ కు ఎలాంటి కాలపరిమితి లేదని, కానీ, 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటీషన్లపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు కోర్టు సూచించింది.